Physical condition
-
బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ప్రసవం తర్వాత కూడా..
స్త్రీలు తమ జీవితంలో మాతృత్వాన్ని వరంగా భావిస్తుంటారు. అయితే, మారుతున్న సమాజం, జీవన పరిస్థితులు వీటితో పాటు విభిన్న రంగాలలో.. వివిధ వృత్తులలో రాణిస్తున్న మహిళలు పనుల దృష్ట్యానో, స్థిరపడలేదనో.. బిడ్డలను కనే సమయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. కొన్నిస్లారు వృత్తికి – అందానికి ముడిపెట్టే సందర్భాలూ తలెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు వైద్యపరంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ కొత్త వివాదాలకు దారులు తీస్తుంటారు. సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. వీటిలో మంచీ చెడులు ఎలా ఉన్నా ప్రసవం తర్వాత స్త్రీ శారీరక స్థితిని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగే పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు. ఇటీవల సినీనటి నయనతార సరోగసి విధానం ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యిందనే వార్త వైరల్ అవుతోంది. అందం ప్రధానాంశంగా ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది. పిల్లలు పుట్టిన తర్వాత శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే, వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదని గ్లామర్ ఫీల్డ్‌లో ఉండి తల్లి అయినవారు తమ జీవనశైలి గురించి ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంటారు. ఇందులో భాగంగా ఇటీవల సినీనటి కాజల్ అగర్వాల్ బిడ్డను కన్నాక తన శరీరంలో వచ్చిన మార్పులు, వాటిని అనుకూలంగా మార్చుకునే పద్ధతుల మీద రిలీజ్ చేసిన నోట్ కూడా వైరల్ అవుతోంది. ఇలాంటప్పుడు కుటుంబ, సామాజిక, ఆరోగ్యకరమైన జీవనశైలికి స్వయంగా తీసుకోదగిన నిర్ణయాల్లో అవగాహన ప్రధాన అంశం అవుతుంది.. ♦ నాలుగు నెలల నుంచి.. మాతృత్వపు ఆనందాన్ని పొందుతూనే వృత్తిపరంగా తనను తాను మలుచుకుంటున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న స్వీయఅనుభవాలలో ‘మాతృత్వం అంటే కెరీర్‌కు ముగింపు కాదు. కెరీర్ గురించి ఆలోచిస్తున్నామంటే బిడ్డను నిర్లక్ష్యం చేయడం కాదు. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోతాం అనే భావన కానీ, గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరమే లేదు. ప్రసవం తర్వాత వర్క్‌లోకి వెళ్లడానికి కొంత సమయం పట్టచ్చు. కానీ, మన ప్రాధాన్యతలను సెట్ చేసుకుంటే ప్రతీది సరిగ్గా, సులభంగా చేయచ్చు. నేను ప్రసవం అయ్యాక నాలుగు నెలల నుంచి తిరిగి పని చేయడం మొదలుపెట్టాను. ముందు నా శరీరం ఎలా ఉండేదో.. తర్వాత ఎలా ఉంటుందో అనే ఆలోచన నాకు లేదు. బిడ్డ పుట్టడం అనుభూతిని నేను పొందగలిగాను. శారీరక శ్రమ ద్వారా నా బాడీని నేను కాపాడుకోగలనన్న నమ్మకం నాకుంది. అందుకు జిమ్‌కు వెళుతున్నాను. గుర్రపు స్వారీ మునుపటి కన్నా కష్టంగా ఉన్నట్టు మొదట్లో అనిపించింది. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కూడా అలాగే అనిపించింది. నా శక్తిస్థాయిలను తిరిగి పొందడానికి చేసే ప్రక్రియ మునుపటి కన్నా కొంత కష్టమైనదే. కానీ, తిరిగి నైపుణ్యాల సాధనను ఒక హాబీగా కొనసాగించేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు ఈ ప్రక్రియ నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది’ అని రాసిన ఈ నోట్ ఎంతో మంది తల్లులకు స్ఫూర్తినిస్తుంది. ♦ రెండు నెలల నుంచి .. ఇరవై ఏళ్లుగా హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్‌గా ఉన్న అనుప్రసాద్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ– ‘నార్మల్ డెలివరీ అయినవాళ్లు రెండు నెలల నుంచీ, సిజేరియన్ అయితే ఆరు నెలల నుంచి జిమ్‌లో వ్యాయామాలు చేయచ్చు. ముందుగా వారి వివరాలను జిమ్ ట్రైనర్‌కి చెప్పి, తగిన వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇరవై ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను, ఎంతో మంది మహిళలకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చాను. బాడీఫిట్నెస్కు కృషి చేసేవారిలో అమ్మాయిలే కాదు, అమ్మలూ ఉన్నారు. ప్రసవం తర్వాత కొన్నాళ్ల పాటు పిల్లల పనులు, ఇంటి పనులతో తీరికలేదని.. వ్యాయామం అనే ఆలోచన చేయరు. దీంతో పాటు వీరు తీసుకునే ఆహారం సరైనదిగా ఉండకపోవడంతో శరీరంలో మరిన్ని మార్పులు వస్తాయి. అందుకే, చాలా మందిలో ‘పిల్లలు పుట్టాక శరీరం లావు అవుతుంది లేదంటే, షేప్ ఉండదు..’ అనుకుంటారు. కానీ, నిజానికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది’ అని వివరించారు. ♦ ఆరు వారాల నుంచి.. ప్రసవం తర్వాత తల్లులకు చెప్పే జాగ్రత్తలలో వ్యాయామం తప్పనిసరిగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీష. ‘ప్రీ ప్రెగెన్సీలో ఉన్న ప్రతి సిస్టమ్ ప్రసవం తర్వాత ఆరు వారాల సమయంలో సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తపడమని చెబుతాం. అలాగే, కొద్ది రోజులు బరువులు ఎత్తకుండా సాధారణ పనులు చేసుకోవచ్చు. మంచి ప్రొటీన్స్ ఉన్న పోషకాహారం తీసుకోవాలి. సిజేరియన్ అయితే గాయం మానడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు ఇంటి వద్ద చేయదగిన వ్యాయామాల గురించి వివరిస్తాం’ అని తెలిపారు. అందం మాతృత్వానికి ఎప్పుడూ కొలమానం కాదు. జీవన విధానంలో వచ్చే ఆనందాలను పొందుతూనే, ఎంచుకున్న రంగంలో విజయశిఖరాలను అంతే హుందాగా పొందవచ్చు. అపోహలకు దూరం ప్రసవం తర్వాత మూడు నెలల నుంచి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. పోస్ట్ నేటెల్ ఎక్సర్సైజులు అని ఉంటాయి. ఈ వ్యాయామం వల్ల చర్మం, కండరాలు తిరిగి వాటి సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల అందం పోతుందని కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఎక్కువ సేపు ఫీడింగ్ ఇవ్వకుండా ఉన్నా సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. మన జీవన శైలి సరిగ్గా ఉంటే శరీరాకృతిలో పెద్ద మార్పులు రావు. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్ తగినంత సాధన జిమ్‌లో వ్యాయామాలు చేయాలనుకున్నవారు ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. వారి ఇతరత్రా ఆరోగ్య సమస్యలను బట్టి నెమ్మదిగా వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. ఒకేసారి వర్కౌట్స్ కాకుండా లైట్‌వెయిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి రోజూ కొద్దిగా టైమ్‌ను పెంచుకుంటూ శరీరానికి వ్యాయామం అలవాటు చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. దీంతో వారి పూర్వపు శరీరాకృతి వచ్చేస్తుంది. వాకింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ రోజూ గంట సేపు చేసినా మంచి ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు నూనె, చక్కెర, జంక్ పదార్థాలు కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యంగానూ, యాక్టివ్‌గానూ ఉంటారు. – అనుప్రసాద్, హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ – నిర్మలారెడ్డి -
కోర్టులు భౌతికంగా పనిచేయక తప్పదు: సుప్రీం
న్యూఢిల్లీ: హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ సవ్యంగా సాగడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వర్చువల్ విచారణ ఇక తప్పనిసరి కాదని తెలిపింది. కోవిడ్ మహమ్మారి ముందు మాదిరిగా న్యాయస్థానాలు ఇకపై భౌతిక విచారణలు జరపాలని సూచించింది. ‘కోర్టుల్లో కూర్చుని, స్క్రీన్ల వైపు చూస్తూ విచారణలను నిర్వహించడం మాకు సంతృప్తికరంగా లేదు’ అని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. కోర్టులు తిరిగి యథావిధిగా పనిచేయాలనీ, పౌరులందరికీ న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరింది. వర్చువల్ విచారణను పిటిషనర్ల ప్రాథమిక హక్కుగా ప్రకటించాలంటూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలనే విషయమై తగు సూచనలు ఇవ్వాల్సిందిగా పిటిషనర్లయిన కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ శైలేష్ ఆర్ గాంధీ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ జూలియో రిబీరో తదితరులకు నోటీసులిచ్చింది. -
నడుం పట్టు
యోగా రోజులో ఎంత ఎక్కువ సమయం కూర్చుంటే అంతగా ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం కూర్చుని చేసే పనుల వల్ల బ్యాక్ పెయిన్, వెన్నెముక సమస్యలు తప్పవని పలువురు కార్పొరేట్ ఉద్యోగుల శారీరక పరిస్థితి నిరూపిస్తోంది. కూర్చుని చేసే ఉద్యోగాలతో తలెత్తే నడుం పట్టుకుపోవడం వంటి ఇబ్బందులకు ఆసనాల సాధన అనే ఉడుంపట్టుతోనే పరిష్కారం లభిస్తుంది. l1 నుండి l5 వరకు ఉన్న వెన్నుపూసలు వాటి మధ్యలో ఉన్న డిస్కులు, వాటికి సపోర్ట్‌గా ఉండే జాయింట్స్, నరాలు, లిగమెంట్సు, కండరాలకు, కింద భాగంలో ఉన్న వెన్నుపూసలకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా దానిని కింది వెన్నెముక లోయర్ స్పైన్ లేదా లోయర్ బ్యాక్ సమస్యగా పరిగణించవచ్చు. అయితే ఈ సమస్యకు ముఖ్య కారణం రెండు వెన్నుపూసల మధ్యలో ఉన్న డిస్క్కి సంబంధించిన డిస్క్ బల్జ్, స్లిప్డ్ డిస్క్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డి–జనరేషన్ (అరుగుదల). దీని వలన వెన్నెముకకు ఆనుకుని పయనించే నరాల మీద ఒత్తిడి పడి లోయర్ బ్యాక్ పెయిన్, సయాటికా, కాలు జాలుగా ఉండటం లేదా చలనం లోపించడం వంటి సమస్యలు రావచ్చు. బరువైన వస్తువులను లేపడం, కూర్చునే భంగిమ లోపాలు, ఆటల కారణంగా అయిన గాయాలతో కండరాలు స్ట్రెయిన్ అవడం వలన లేదా లిగమెంట్స్ పట్టుకోవడం సంభవిస్తుంది. ఈ సమస్య నుంచి యోగా, కాయచికిత్స. ఐస్ లేదా కోల్డ్ ప్యాక్స్, హీట్ థెరపీల ద్వారా ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా వెన్నెముక దగ్గర ఉండే 3 కండరాలైన ఎక్స్టెన్సర్స్, ఫ్లెక్సార్స్, రొటేటర్స్కు బాగా వ్యాయామం అందించే ఆసనాలను సాధన చేయాలి. మేరుదండ పరివృత్తాసన మ్యాట్ మీద వెల్లికిలా పడుకుని, మెకాళ్లు రెండూ పైకి లేపి, కాలి మడమలను సీట్ భాగానికి దగ్గరగా ఉంచాలి. రెండు చేతులు 180 డిగ్రీల కోణంలో సరళరేఖలో ఉంచి, కుడి మోకాలు మీద ఎడమ మోకాలు, కుడిపాదం మీద ఎడమ పాదం ఉంచి శ్వాస తీసుకుంటూ మోకాళ్లు రెండూ కలిపి కుడివైపుకు, తలను ఎడమవైపుకు, శ్వాస వదులుతూ మోకాళ్లు పైకి మధ్యలోకి, తల మధ్యకు, తిరిగి 2, 3 సాధారణ శ్వాసల తరువాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండవ వైపుకి చేయాలి. ఇలా 10 సార్లు రిపీట్ చేయాలి. చేసే సమయంలో తొందర పనికిరాదు. మేరుదండ పరివృత్తాసన–2 మోకాళ్ళు రెండూ పైకి నిలబెట్టి, పాదాలు రెండూ యోగా మ్యాట్కిరువైపులా అంచులకు దగ్గరగా ఉంచాలి. చేతులు 180 డిగ్రీల కోణంలో సరళరేఖలో ఉంచి, శ్వాస తీసుకుంటూ తల కుడివైపుకు, కుడిమోకాలు ఎడమపాదం దగ్గరకు, తిరిగి శ్వాస వదులుతూ తల మోకాళ్ళు యధాస్థితికి మధ్యలోకి తీసుకురావాలి. ఈ విధంగా రెండవవైపు కూడా చేయాలి. ఇలా 10 సార్లు ఇలా రిపీట్ చేయాలి. మేరుదండ పరివృత్తాసన–3 చేతులు రెండూ 180 డిగ్రీల కోణంలో ఉంచి, కుడికాలు స్ట్రెయిట్‌గా ఉంచి కుడి మోకాలు మీద ఎడమపాదాన్ని ఉంచి ఎడమ మోకాలును పైకి నిలబెట్టి ఉంచి, శ్వాస తీసుకుంటూ తలను ఎడమవైపుకు, ఎడమ మోకాలుని కుడివైపుకు భూమికి దగ్గరగా తీసుకురావాలి. శ్వాస వదుల్తూ మధ్యలోకి, ఇదేవిధంగా రెండవ కాలును ఉపయోగిస్తూ రెండవవైపుకి చేయాలి. ఏకపాద పవన ముక్తాసన ఫొటోలో చూపిన విధంగా ఎడమకాలుని నిటారుగా ఉంచాలి. కుడికాలుని మడచి మోకాలుని గడ్డానికి దగ్గరగా తీసుకువచ్చి కుడి చేయి కుడి మోకాలు కింద నుండి తీసుకువెళ్ళి, ఆ సపోర్ట్‌తో మోకాలును గడ్డానికి కానీ నుదుటికి కానీ దగ్గరగా తీసుకువచ్చి, పూర్తిగా రిలాక్స్›్డ స్టేట్‌లో కనీసం 10 శ్వాసల కాలం ఉండవచ్చు. ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. ద్విపాద పవనముక్తాసన ఫొటోలో చూపిన విధంగా రెండు మోకాళ్ళను పాదాలను కలిపి ఉంచి శ్వాస వదులుతూ మోకాళ్లు రెంటినీ రెండు చేతులతో చుట్టి పొట్టకు అదుముతూ, తలను లేదా నుదుటిని మోకాళ్ళ దగ్గరకు తీసుకురావాలి. 5 శ్వాసల తరువాత కాళ్ళు రెండూ స్ట్రెచ్ చేసి మళ్ళీ రెండవవైపుకి చేయాలి. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ మోడల్ ఈషా హిందోచా