ప్రతీకాత్మక చిత్రం
స్త్రీలు తమ జీవితంలో మాతృత్వాన్ని వరంగా భావిస్తుంటారు. అయితే, మారుతున్న సమాజం, జీవన పరిస్థితులు వీటితో పాటు విభిన్న రంగాలలో.. వివిధ వృత్తులలో రాణిస్తున్న మహిళలు పనుల దృష్ట్యానో, స్థిరపడలేదనో.. బిడ్డలను కనే సమయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. కొన్నిస్లారు వృత్తికి – అందానికి ముడిపెట్టే సందర్భాలూ తలెత్తుతుంటాయి.
ఇలాంటప్పుడు వైద్యపరంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ కొత్త వివాదాలకు దారులు తీస్తుంటారు. సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. వీటిలో మంచీ చెడులు ఎలా ఉన్నా ప్రసవం తర్వాత స్త్రీ శారీరక స్థితిని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగే పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు.
ఇటీవల సినీనటి నయనతార సరోగసి విధానం ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యిందనే వార్త వైరల్ అవుతోంది. అందం ప్రధానాంశంగా ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది. పిల్లలు పుట్టిన తర్వాత శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే, వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదని గ్లామర్ ఫీల్డ్‌లో ఉండి తల్లి అయినవారు తమ జీవనశైలి గురించి ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంటారు.
ఇందులో భాగంగా ఇటీవల సినీనటి కాజల్ అగర్వాల్ బిడ్డను కన్నాక తన శరీరంలో వచ్చిన మార్పులు, వాటిని అనుకూలంగా మార్చుకునే పద్ధతుల మీద రిలీజ్ చేసిన నోట్ కూడా వైరల్ అవుతోంది. ఇలాంటప్పుడు కుటుంబ, సామాజిక, ఆరోగ్యకరమైన జీవనశైలికి స్వయంగా తీసుకోదగిన నిర్ణయాల్లో అవగాహన ప్రధాన అంశం అవుతుంది..
♦ నాలుగు నెలల నుంచి..
మాతృత్వపు ఆనందాన్ని పొందుతూనే వృత్తిపరంగా తనను తాను మలుచుకుంటున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న స్వీయఅనుభవాలలో ‘మాతృత్వం అంటే కెరీర్‌కు ముగింపు కాదు. కెరీర్ గురించి ఆలోచిస్తున్నామంటే బిడ్డను నిర్లక్ష్యం చేయడం కాదు. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోతాం అనే భావన కానీ, గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరమే లేదు.
ప్రసవం తర్వాత వర్క్‌లోకి వెళ్లడానికి కొంత సమయం పట్టచ్చు. కానీ, మన ప్రాధాన్యతలను సెట్ చేసుకుంటే ప్రతీది సరిగ్గా, సులభంగా చేయచ్చు. నేను ప్రసవం అయ్యాక నాలుగు నెలల నుంచి తిరిగి పని చేయడం మొదలుపెట్టాను.
ముందు నా శరీరం ఎలా ఉండేదో.. తర్వాత ఎలా ఉంటుందో అనే ఆలోచన నాకు లేదు. బిడ్డ పుట్టడం అనుభూతిని నేను పొందగలిగాను. శారీరక శ్రమ ద్వారా నా బాడీని నేను కాపాడుకోగలనన్న నమ్మకం నాకుంది. అందుకు జిమ్‌కు వెళుతున్నాను. గుర్రపు స్వారీ మునుపటి కన్నా కష్టంగా ఉన్నట్టు మొదట్లో అనిపించింది.
మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కూడా అలాగే అనిపించింది. నా శక్తిస్థాయిలను తిరిగి పొందడానికి చేసే ప్రక్రియ మునుపటి కన్నా కొంత కష్టమైనదే. కానీ, తిరిగి నైపుణ్యాల సాధనను ఒక హాబీగా కొనసాగించేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు ఈ ప్రక్రియ నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది’ అని రాసిన ఈ నోట్ ఎంతో మంది తల్లులకు స్ఫూర్తినిస్తుంది.
♦ రెండు నెలల నుంచి ..
ఇరవై ఏళ్లుగా హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మోటివేటర్‌గా ఉన్న అనుప్రసాద్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ– ‘నార్మల్ డెలివరీ అయినవాళ్లు రెండు నెలల నుంచీ, సిజేరియన్ అయితే ఆరు నెలల నుంచి జిమ్‌లో వ్యాయామాలు చేయచ్చు. ముందుగా వారి వివరాలను జిమ్ ట్రైనర్‌కి చెప్పి, తగిన వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇరవై ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను, ఎంతో మంది మహిళలకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చాను. బాడీఫిట్‌నెస్‌కు కృషి చేసేవారిలో అమ్మాయిలే కాదు, అమ్మలూ ఉన్నారు.
ప్రసవం తర్వాత కొన్నాళ్ల పాటు పిల్లల పనులు, ఇంటి పనులతో తీరికలేదని.. వ్యాయామం అనే ఆలోచన చేయరు. దీంతో పాటు వీరు తీసుకునే ఆహారం సరైనదిగా ఉండకపోవడంతో శరీరంలో మరిన్ని మార్పులు వస్తాయి. అందుకే, చాలా మందిలో ‘పిల్లలు పుట్టాక శరీరం లావు అవుతుంది లేదంటే, షేప్ ఉండదు..’ అనుకుంటారు. కానీ, నిజానికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది’ అని వివరించారు.
♦ ఆరు వారాల నుంచి..
ప్రసవం తర్వాత తల్లులకు చెప్పే జాగ్రత్తలలో వ్యాయామం తప్పనిసరిగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీష. ‘ప్రీ ప్రెగెన్సీలో ఉన్న ప్రతి సిస్టమ్ ప్రసవం తర్వాత ఆరు వారాల సమయంలో సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తపడమని చెబుతాం.
అలాగే, కొద్ది రోజులు బరువులు ఎత్తకుండా సాధారణ పనులు చేసుకోవచ్చు. మంచి ప్రొటీన్స్ ఉన్న పోషకాహారం తీసుకోవాలి. సిజేరియన్ అయితే గాయం మానడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు ఇంటి వద్ద చేయదగిన వ్యాయామాల గురించి వివరిస్తాం’ అని తెలిపారు. అందం మాతృత్వానికి ఎప్పుడూ కొలమానం కాదు. జీవన విధానంలో వచ్చే ఆనందాలను పొందుతూనే, ఎంచుకున్న రంగంలో విజయశిఖరాలను అంతే హుందాగా పొందవచ్చు.
అపోహలకు దూరం
ప్రసవం తర్వాత మూడు నెలల నుంచి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. పోస్ట్ నేటెల్ ఎక్సర్‌సైజులు అని ఉంటాయి. ఈ వ్యాయామం వల్ల చర్మం, కండరాలు తిరిగి వాటి సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల అందం పోతుందని కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఎక్కువ సేపు ఫీడింగ్ ఇవ్వకుండా ఉన్నా సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. మన జీవన శైలి సరిగ్గా ఉంటే శరీరాకృతిలో పెద్ద మార్పులు రావు.
– డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్
తగినంత సాధన
జిమ్‌లో వ్యాయామాలు చేయాలనుకున్నవారు ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. వారి ఇతరత్రా ఆరోగ్య సమస్యలను బట్టి నెమ్మదిగా వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. ఒకేసారి వర్కౌట్స్ కాకుండా లైట్‌వెయిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి రోజూ కొద్దిగా టైమ్‌ను పెంచుకుంటూ శరీరానికి వ్యాయామం అలవాటు చేస్తూ ప్రాక్టీస్ చేయాలి.
దీంతో వారి పూర్వపు శరీరాకృతి వచ్చేస్తుంది. వాకింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ రోజూ గంట సేపు చేసినా మంచి ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు నూనె, చక్కెర, జంక్ పదార్థాలు కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యంగానూ, యాక్టివ్‌గానూ ఉంటారు.
– అనుప్రసాద్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మోటివేటర్
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment