
న్యూఢిల్లీ: హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ సవ్యంగా సాగడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వర్చువల్ విచారణ ఇక తప్పనిసరి కాదని తెలిపింది. కోవిడ్ మహమ్మారి ముందు మాదిరిగా న్యాయస్థానాలు ఇకపై భౌతిక విచారణలు జరపాలని సూచించింది. ‘కోర్టుల్లో కూర్చుని, స్క్రీన్‌ల వైపు చూస్తూ విచారణలను నిర్వహించడం మాకు సంతృప్తికరంగా లేదు’ అని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. కోర్టులు తిరిగి యథావిధిగా పనిచేయాలనీ, పౌరులందరికీ న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరింది. వర్చువల్ విచారణను పిటిషనర్ల ప్రాథమిక హక్కుగా ప్రకటించాలంటూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ అనే ఎన్‌జీవో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలనే విషయమై తగు సూచనలు ఇవ్వాల్సిందిగా పిటిషనర్లయిన కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ శైలేష్ ఆర్ గాంధీ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ జూలియో రిబీరో తదితరులకు నోటీసులిచ్చింది.