ఫిజియోథెరపీ కౌన్సిల్ కల నెరవేరేనా?
లబ్బీపేట(విజయవాడ తూర్పు): వైద్య రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఫిజియోథెరపిస్ట్‌లకు ప్రభుత్వ పరంగా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. నాలుగున్నర సంవత్సరాలు చదివి, పొందిన డిగ్రీలను ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మొండి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తున్న ఫిజియోథెరపిస్టలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం రాష్ట్రంలో ఫిజియోథెరపీ కౌన్సిల్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఇటీవల జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆవేదన విన్నవించారు.
వైద్య రంగంలో కీలకంగా...
గుండె బైపాస్ ఆపరేషన్.. సిజేరియన్ ఇలా ఎలాంటి సర్జరీ చేసినా అనంతరం కండరాలు సాధారణ స్థితికి చేరేందుకు ఫిజియోథెరపీ ఎంతో కీలకంగా మారింది. కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు, స్పైన్ సర్జరీల్లో, వెన్నునొప్పి, మెడనొప్పి వంటి అనేక సమస్యలకు, డయాబెటీస్ న్యూరోపతి సమస్యలకు ఫిజియోథెరపి పరిష్కార మార్గం అయింది. నేడు ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలోను ఇద్దరు ముగ్గురు ఫిజియోథెరపిస్టులు ఉంటున్నారంటే వారి ప్రాధాన్యం ఎంతగా ఉందో అర్థమవుతోంది. అలాంటి వృత్తికి ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదని ఫిజియోథెరఫిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఫిజియోథెరపి కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేçస్తున్నారు.
రాష్ట్రంలో 20 వేల మందికిపైగా..
రాష్ట్రంలో ఫిజియోథెరపీ చదివిన వారు 20 వేల మంది వరకూ ఉండగా, వారిలో 10 వేల మంది వృత్తిలో కొనసాగుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే 5 వేల మంది వరకు ఉన్నారు. వారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే వృత్తిలో కొనసాగుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 26 ఫిజియోథెరపి ఇనిస్టిట్యూట్లు ఉండగా, ప్రతి ఏటా 1100 మంది కోర్సును పూర్తి చేసి బయటకు వస్తున్నారు. అలాంటి వారందరికీ తగిన గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రిల్లో నియామకాలు జరపాలి
ప్రభుత్వ పరంగా తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు, ప్రభుత్వాస్పత్రిల్లో ఫిజియోథెరపిస్టుల నియామకాలు జరపాలి. ప్రస్తుతం టీచింగ్ ఆస్పత్రిల్లో మాత్రం నామమాత్రంగా ఉంటున్నారు. జిల్లా ఆస్పత్రిలు, ఏరియా ఆస్పత్రిలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలి. అందుకు ప్రభుత్వం కృషి చేయాలి.–డాక్టర్ సుదీప్తి వర్ధన్, ఫిజియోథెరపిస్ట్
మా డిగ్రీలు రిజిస్ట్రేషన్ చేయాలి
మేము నాలుగున్నర సంవత్సరాల పాటు ఫిజియో థెరపిలో డిగ్రీ(బీపీటీ) చేయడంతో పాటు, మూడేళ్లు పోస్టు గ్రాడ్యుయేషన్(ఎంపీటీ) చేసి ప్రాక్టీసు చేస్తున్నా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లేక పోవడంతో తగిన గుర్తింపు ఉండటం లేదు. కొందరు మరో నాలుగేళ్లు కష్టపడి పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఇలా డిగ్రీలు చేసినా రిజిస్ట్రేషన్‌కు కౌన్సిల్ లేకపోవడం బాధాకరం.–డాక్టర్ కీర్తి ప్రియ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వి ఫిజియోస్ అసోసియేషన్