ఒక ఆత్మీయ అతిథి
తపాలా: మే నెలాఖరు రోజులు. రోహిణికార్తె ప్రభావంతో ఎండలు మండి పోతున్నాయి. దానికితోడు కరెంట్కోత, నీటి కొరత. ఇలాంటి పరిస్థితులలో మా ఇంటికి అతిథి రాబోతున్నారంటే నాకు కొంచెం కంగారుగానే ఉంది. అందులోనూ వచ్చేవారు నాకైతే పరిచయం లేరు. మావారికి కాలేజీ రోజుల్లో క్లాస్మేట్. చాలా సంవత్సరాల తరువాత స్నేహితుల ద్వారా అడ్రస్ తెలుసుకొని రాబోతున్నారు. ఎలా ఉంటారో, ఏమో!
సాధారణంగా మావారి కొలీగ్స్ కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వాళ్ల వ్యక్తిగత పనుల మీదగానీ, ఆఫీస్ పనుల మీదగానీ మా ఊరు వచ్చినప్పుడు తప్పకుండా తనని కలిసే వెళతారు. భార్యా, పిల్లలతో వచ్చినప్పుడు కూడా వాళ్ల బిజీ షెడ్యూల్లోనూ ఏదో ఒక పూట వీలు చూసుకొని మాయింటికి రావడం, భోంచేసి వెళ్లడం మామూలే. కొత్తవారైతే ఆకాస్త సమయంలోనే పరిచయం చేసుకొని, నాలుగు కబుర్లు చెప్పుకొని భోంచేయడం... ఆ తరువాత వీడ్కోలు! మరలా వారి కుటుంబాన్ని కలుసుకోవడం ఎప్పటికో గానీ కుదరదు. ‘‘ఇప్పుడు మనింటికి వచ్చే అతిథి కూడా ఇంతే’’ అని అనుకున్నాం, నేనూ మా అమ్మాయీ.
ప్రక్క ఊరిలో పనుండి వచ్చిన స్నేహితుడిని ముందురోజు అక్కడికి వెళ్లి రిసీవ్ చేసుకొని, వచ్చిన పని పూర్తి చేసుకొని, ఈరోజు మధ్యాహ్నం భోజనం వేళకు వచ్చేస్తాం అని చెప్పారు మావారు. రెండింటికి వస్తామన్నవాళ్లు నాలుగవుతుండగా వచ్చారు. రాగానే తన స్నేహితుడిని నాకూ, మా అమ్మాయికీ పరిచయం చేసారు మావారు. వాళ్లిద్దరూ ఇంజినీరింగ్ క్లాస్మేట్స్. 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆయన మర్యాదపూర్వకంగా నమస్కరించి గంభీరంగా ఉండిపోలేదు. భోజనం చేస్తున్నంత సేపూ మావారితోనే కాకుండా నాతో, మా అమ్మాయితో మాట్లాడుతూ, తన ఫ్యామిలీ వివరాలు కూడా చెప్తూ, వండిన పదార్థాలను మెచ్చుకుంటూ... కొద్ది సమయంలోనే తన ప్రవర్తనతో మాకు ఎప్పటినుంచో పరిచయమున్న ఆత్మీయుడిలా అనిపించారు. మా అమ్మాయి సాధారణంగా ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడదు. అలాంటిది తనుకూడా మాతో కలిసిపోయి సరదాగా మాట్లాడుతూ ఉంటే నాకు అతిథిపై మరికొంచెం గౌరవం పెరిగింది. ఆయన్ని చూస్తే పరిచయంలేని వ్యక్తిలా కనిపించలేదు. వేల మైళ్ల దూరంలో ఉంటూ మూడేళ్లకోసారి అందరినీ కలుసుకోవాలని, ఆత్మీయంగా మెలగాలని, ఎంతో ఆప్యాయంగా వచ్చే మా అన్నయ్యే గుర్తొచ్చారు. సాయంత్రం అదే ఊరిలో ఉంటున్న తన డీఐజీ బాల్య స్నేహితుడి ఇంటికి వెళుతూ మమ్మల్నీ తనతో రమ్మని ఆహ్వానించారు మా అతిథి. ‘మీ స్నేహితుడి ఇంటికి మేమెందుకు? మీరు మీ స్నేహితునితో వెళ్లండి’ అన్నాను నేను. ‘ఒకే ఊరిలో ఉంటున్నారు. ఆ కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. వారూ మీలాగే నాకు ఆప్తులు’ అని చెప్పగానే మరేం మాట్లాడకుండా బయలుదేరాం. మా అమ్మాయి కూడా ఒప్పుకోవడం నాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది.
మా అతిథితో తన స్నేహితుడి ఇంటికి మేము అతిథులుగా వెళ్లడం... అక్కడ వారు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి, వారి స్నేహపూర్వక ప్రవర్తన... వారితో మేము గడిపిన కొద్ది సమయం ఎంత సరదాగా గడిచిపోయిందో యిదంతా మాటలతో వ్యక్తపరచలేని అనుభూతిని ఇచ్చింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దగ్గరలోని గుడికి వెళ్లాం. భగవంతుని సన్నిధిలో మా కుటుంబంపైన తన అభిప్రాయాన్ని తెలపడం... వీడ్కోలు సమయంలో తన స్నేహితుడికి అపురూప కానుక నివ్వడం... మాతో ఫొటోలు తీసుకొని పదిల పరుచుకోవడం... ఇలాంటివెన్నో మా అతిథి మాకందించారు. మండు వేసవిలోనే తియ్యతియ్యని మామిడిపండ్లు, చల్లచల్లని ముంజలు దొరికినట్లే ఈ వేసవిలో మా ఇంటికి వచ్చి, స్నేహమనే దారంతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను కూర్చి, తన ప్రవర్తనా పరిమళాన్ని దానికి చేర్చి, తోరణంగా మా గుమ్మానికి కట్టి వెళ్లిన మా ఆత్మీయ అతిథీ... మీరు మళ్లీ మా ఇంటికి ఎప్పుడు వస్తారు?
- పైడి వాసవి, గుంటూరు