రాజకీయ లబ్ధికి సీఎం కేసీఆర్ తాపత్రయం
వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్
సిద్దిపేట అర్బన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని పేదలకు ఉస్మానియా యూనివర్సిటీ స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించి విద్యార్థులకు, నిరుపేదలకు మధ్య చిచ్చు పెట్టారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు పిడిశెట్టి దుర్గాప్రసాద్ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
ఓయూ భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం చట్ట ప్రకారం కుదరకపోయినా ఇలాంటి ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పాలకమండలి ఏకగ్రీవంగా ఆ భూముని ప్రభుత్వానికి కేటాయించేస్తే సీఎం కేసీఆర్ ఆలోచన నెరవేరుతుందన్నారు. ఇప్పటికే ఎంతో విలువైన యూనివర్సిటీ భూమి అన్యాక్రాంతమైందని యూజీసీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆ భూముని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. పేదల ఇండ్ల కోసం సీఎం మరో చోట భూములను కేటాయించాలన్నారు.