48 గంటల్లో తరలించాలి
అనంతపురం న్యూసిటీ : నగరంలోని పందులను 48 గంటల్లో ఊరి బయటకు తరలించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసును జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక వినాయకనగర్‌లో పర్యటించారు. వీధుల్లో కలియ తిరిగి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని, రోజూ డ్రైనేజీలను శుభ్రం చేయాలని సూచించారు. ఫాగింగ్, స్ప్రేయింగ్ క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలన్నారు.
వినాయకనగర్‌లో రక్తనమూనాలు సేకరించి, జ్వరపీడితులుంటే వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య,ఆరోగ్యశాఖాధికారులకు సూచించారు. దోమకాటు వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 10 లక్షల కరపత్రాలను ముద్రించి ప్రజలకు పంచాలన్నారు. డీఎంహెచ్ఓ, మునిసిపల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు మంత్రులకు, అధికారులకు సమాచారం అందివ్వాలన్నారు.