'జూపూడి, కారెం చంద్రబాబుకు దళారీలు'
నెల్లూరు (సెంట్రల్) : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కారెం శివాజిలు సీఎం చంద్రబాబుకు దళారులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. నెల్లూరులోని ఒక హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూపూడి, కారెం శివాజికి ఆ పదవులు ఇవ్వడం అన్యాయమన్నారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరూ కోరుకోరు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం ఆయన నియంత పాలనకు నిదర్శనమన్నారు.
సీఎం వ్యాఖ్యలకు రాష్ర్ట వ్యాప్తంగా దళితులు నిరసనలు చేపడుతుంటే కారెం, జూపూడిలు బాబుకు వత్తాసు పలకడం దళితులకు ద్రోహం చేయడమేనన్నారు. దళితుల ముసుగులో అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్న కారెం శివాజిని ఉన్నతమైన పదవిలో కూర్చోపెట్టడం ఎంత వరకు సబబన్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా వారం రోజుల పాటు ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 23న ప్రభుత్వ కార్యాలయాల ముందు చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్లు తెలిపారు.