హైదరాబాద్ విమానం నుంచి మోహన్‌లాల్ టీమ్ దింపివేత
కొచ్చి: మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు చెందిన కేరళ స్ట్రైక ర్స్ క్రికెట్ టీమ్ బృందంలోని 30 మంది సినీ, టీవీనటులు తమ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ వారిని విమానం నుంచి బలవంతంగా దించేసింది. కొచ్చిలో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.
ఇండిగో తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌తో శనివారం తలపడేందుకు ఈ నటులు ‘6ఈ-314’ విమానం ఎక్కారు. కొందరు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో వీరిని దింపేయాలని పైలట్ భద్రతా సిబ్బందిని కోరి విమానాన్ని పార్కింగ్‌కు తెచ్చారు. తోటి ప్రయాణికులు కూడా వారిని దింపేయాలని కోరడంతో వారిని దింపేశారు. మోహన్‌లాల్ బృందాన్ని వేరే విమానంలో హైదరాబాద్ పంపారు.