pilot suspended
-
తప్పు కోడ్ పంపినందుకు పైలెట్ సస్పెండ్
శ్రీనగర్ : విమానానికి సంబంధించిన 'హైజాక్ కోడ్'ను ఏటీఎస్ అధికారులకు తప్పుగా పంపినందుకు ఎయిర్ ఏషియా ఇండియాకు చెందిన పైలెట్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. జూన్ 9న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న E-I5-715 విమానంలో సాంకేతిక లోపంతో ఒక ఇంజిన్ నిలిచిపోయింది. విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ రవి రాజ్ అత్యవసర కోడ్ 7700ను ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎటిఎస్) అధికారులకు పంపాల్సి ఉండగా, దానికి బదులు 7500 ను పంపినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ విషయాన్నితీవ్రంగా పరిగణించిన డీజీసీఏ జూన్ 28న సదరు పైలెట్‌కు షోకాజ్ నోటీసులు పంపినట్లు పేర్కొంది. అయితే దీనికి సంబంధించి కెప్టెన్ రవిరాజ్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో అతన్ని మూడునెలల పాటు విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీజీసీఏ వివరించింది. కాగా, విమానానికి సంబంధించి సాంకేతిక లోపాన్ని సరైన సమయంలో గుర్తించనందుకు, పైలట్ రవిరాజ్ పనితీరును సరిగ్గా పర్యవేక్షించనందుకు పైలట్ కమ్ కమాండర్ కిరణ్ సాంగ్వాన్‌ను హెచ్చరించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయనను ఆదేశించింది. -
విమానం కాక్‌పిట్‌లో దుస్తులు విప్పి..
లండన్: భూమికి 38వేల అడుగుల ఎత్తులో.. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళుతోన్న విమానాన్ని పైలట్ ఎంత జాగ్రత్తగా నడపాలి? ఎంత బాధ్యతతో మెలగాలి? కానీ ఇవేవీ పట్టని ఓ పైలట్.. కాక్‌పిట్‌లో దుస్తులు విప్పేసి, మహిళల సాక్స్ ధరించి కాళ్లతో విమానం నడిపాడు. ప్రమాదకరమైన చర్యకు పాల్పడిన కారణంగా సదరు పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే అతని వాదన మరోలాఉంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటిష్ ఎయిర్వేస్లో కెప్టెన్‌గా పనిచేస్తోన్న కొలిన్ గ్లోవర్(51) మధ్యతరహా, భారీ విమానాలను నడపడంలో దిట్ట. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం 777ను నడిపిన అనుభవంకూడా ఉందాయనకు. అయితే విమాన ప్రయాణం మధ్యలో కోలిన్ విపరీత చర్యలకు పాల్పడినట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. వివిధ సందర్భాల్లో పోర్న్ ఫొటోలు చూస్తూ, దుస్తులు విప్పి, కాళ్లతో విమానం నడుపుతున్న ఫొటోలు బహిర్గతం కావడంతో ఎయిర్ వేస్ సంస్థ కొలిన్‌ను సస్పెండ్ చేసింది. అయితే ఆ ఫొటోల్లో ఉన్నది తాను కాదని, తనపై కుట్రజరిగి ఉండొచ్చని కొలిన్ వాదిస్తున్నారు. దీంతో విమానయాన సంస్థ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఒకవేళ ఆ ఫొటోల్లోని వ్యక్తి కొలినే అని తేలితేమాత్రం అతని పైలెట్ లైసెన్స్ శాశ్వతంగా రద్దుచేస్తామని బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రకటించింది. గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పలువురు పైలట్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.