12మంది మహనీయులకు పిండప్రదానం
రాజమహేంద్రవరం కల్చరల్ :
తెలుగు జాతికి ఎనలేని సేవలందించిన 12 మంది మహనీయులకు గోదావరి అంత్యపుష్కరాల సందర్భంగా బ్రౌన్ మందిరం ఆధ్వర్యంలో గురు వారం పిండ ప్రదానం చేశారు. ఆదికవి నన్నయ, కవిసార్వభౌముడు శ్రీనాథుడు, తెలుగు భాషా సాహిత్యాల ఉద్ధారకుడు సీపీ బ్రౌన్, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్, గోదావరిపై తొలి రైలు బ్రిడ్జి నిర్మించిన హేవ్లాక్, యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం, సంస్కరణల కోసం కలంపట్టిన సామినేని ముద్దునరసింహం, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, జానపద వాజ్మయోద్ధారక నేదునూరి గంగాధరం, ఆంధ్రపురాణకర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, పుంభావ సరస్వతి మల్లంపల్లి శరభేశ్వరశర్మ, మహామహోపాధ్యాయ మధుర కృష్ణమూర్తి శాసి్త్రలకు పుష్కరాల రేవులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, బ్రౌను మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి పిండ ప్రదానాలు చేశారు. ఈసందర్భంగా రౌతు మాట్లాడుతూ తెలుగుజాతికి చిరస్మరణీయమైన సేవలందించిన మహనీయులనుఅంత్యపుష్కరాల శుభతరుణంలో సంస్మరించుకోవడం మన కనీస కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సన్నిధానం శాసి్త్రని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందించారు.