ఈ ఫ్యామిలీ నాకు చాలా స్పెషల్ : దాసరి
‘‘ఇప్పటివరకూ చాలా ఆడియో వేడుకల్లో పాల్గొన్నాను. కానీ పినిశెట్టి ఫ్యామిలీ, ఈ ఆడియో వేడుక నాకు చాలా స్పెషల్. అల్లు రామలింగయ్య, చలం వంటి నటులను పరిచయం చేసింది రచయిత పినిశెట్టి శ్రీరామ్మూర్తి (రవిరాజా తండ్రి). ఆయన కుటుంబానికి చెందిన మూడు తరాల వారితోనూ సినిమాలు చేశాను. వారితో నాకు మంచి అనుబంధం ఉంది. రవిరాజా పినిశెట్టి నా దగ్గరే కెరీర్ మొదలుపెట్టాడు. ఇప్పుడు మొదటి సారిగా నిర్మాతగా మారి, ఈ సినిమా తీశాడు. విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని సీనియర్ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు.
ఆదర్శ చిత్రాలయ పతాకంపై రవిరాజా పినిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘మలుపు’. రవిరాజా పెద్ద కుమారుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో రెండో కుమారుడు ఆది హీరోగా నటించారు. ఈ చిత్రంలో నిక్కీ గల్రానీ కథానాయిక. ప్రవీణ్, శ్యామ్, ప్రసన్లు స్వరాలందించిన ఈ చిత్రం పాటల విడుదలవేడుక హైదరాబాద్లో జరిగింది. దాసరి బిగ్ సీడీని ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ సీడీని ఆవిష్కరించి, దర్శకుడు కోదండ రామిరెడ్డికి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ‘‘నా ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలోకి అడుగుపెడ తారని అనుకోలేదు.
ఓ యథార్థ సంఘటన ఆధారంగా సత్య ఈ కథ రాసుకున్నాడు. దర్శకుడిగా తనకిది మొదటి సినిమా కాబట్టి, బయటి నిర్మాతలు వెనకడుగు వేసే అవకాశం ఉంది. అందుకే నేనే నిర్మాతగా మారా’’అని రవిరాజా పినిశెట్టి చెప్పారు. ‘‘అన్నయ్య నాకు మొదట ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. హీరోగా నన్ను తీసుకుంటాడో లేదో అని టెన్షన్ పడ్డాను. కానీ చివరికి నన్నే తీసుకున్నాడు’’ అని ఆది పినిశెట్టి అన్నారు. దర్శకునిగా తాను చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని సత్యప్రభాస్ కోరారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మధు, దర్శకుడు హరీష్ శంకర్, నటుడు శివాజీరాజా తదితరులు పాల్గొన్నారు.