కాంగ్రెస్ లోపాలే బీజేపీ విజయానికి కారణం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అధిక ధరలు, వ్యవసాయ సంక్షోభం వంటి తప్పిదాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనానికి కారణ మయ్యాయని, వాటిని బీజేపీ ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిందని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. ఆదివారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఎన్నికల ఫలితాలు- పరిణామాలు అన్న అంశంపై ఆయన విశ్లేషించారు. దేశంలోని కార్పొరేట్ శక్తులు సర్వశక్తులూ ఒడ్డి నరేంద్రమోడి అధికారంలోకి రావడానికి కృషి చేశాయన్నారు. ప్రజలు కూడా గత ప్రభుత్వ విధానాలపై విసిగి మార్పు కోరుకున్నారని చెప్పారు. ఎన్నికలైన మరుసటిరోజే అంబానీల ఆస్తులు ఒక్క రోజులోనే రూ.12 వేల కోట్లు పెరిగాయని గుర్తు చేశారు. మతతత్వ శక్తులు విజృంభించి మతసామరస్యం దెబ్బతినే ప్రమాదం దేశానికి పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో నెరవేర్చాలని కోరారు.
రుణాల రద్దు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను పెంచాలని, ప్రతి గ్రామానికి తారురోడ్లు, ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి కల్పించాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతురావు మాట్లాడుతూ ఉపాధి హామీ పని చేసిన కూలీలకు జిల్లాలో గతేడాదికి సంబంధించిన కూలి ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడు కంకణాల ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు గాలి వెంకట్రామిరెడ్డి, గంటెనపల్లి వెంకటేశ్వర్లు, మోండ్రు ఆంజనేయులు, ఎన్.వెంకటేశ్వర్లు, వి. ఆంజనేయులు పాల్గొన్నారు.