pipeline leakage
-
దేవాదుల పైప్‌లైన్ లీకేజీ
దామెర: దేవాదుల పైప్‌లైన్ లీకేజీతో ఒక్కసారిగా నీరు నింగిని తాకే విధంగా పైకి ఎగజిమ్మింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పులుకుర్తిలోని దేవాదుల పంప్ హౌజ్ నుంచి భీంఘన్‌పూర్ పంప్‌హౌజ్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పులుకుర్తి శివారులో శనివారం ఉదయం గేట్‌వాల్వ్ లీకేజీ కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరు ఎగిసిపడింది. దీంతో సమీపప్రాంతం మొత్తం జలమయమైంది. పులుకుర్తి గ్రామానికి చెందిన రైతు పండుగ రవి తన రెండెకరాల పొలంలో ఇటీవల నాట్లు వేయగా పొలం పూర్తిగా మునిగిపోయింది. లీకేజీ విషయమై సంబంధిత అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ పైప్‌లైన్ లీకేజీతో రెండెకరాల పత్తి పూర్తిగా మునిగి నష్టం వాటిల్లిందని రవి వాపోయారు. -
ఎగిసిపడిన ‘భగీరథ’
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్ – తోటపల్లి రాజీవ్ రహదారి సమీపంలో మంగళవారం మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలింది. దీంతో నీరు ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. పెద్దలైన్ కావడం.. ప్రెషర్ ఎక్కువగా ఉండటంతో రాజీవ్ రహదారికి ఇరువైపులా నీళ్లు విరజిమ్మాయి. దీంతో కొంతసేపు ప్రయాణానికి ఆటంకం కలిగింది. సమీపంలోని శనగ పంట పూర్తిగా నీట మునిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. చదవండి: (హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం) -
హైదరాబాద్: సునామీ వచ్చిందా ఏంటి?
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి మెహదీపట్నం దగ్గర వాటర్ పైప్‌లైన్ లీకైంది. దీంతో రోడ్డు మొత్తం జలమయమైపోయింది. పిల్లర్ నంబరు 53 దగ్గర పైప్ పగిలి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. గ్యాలన్ల కొద్దీ నీరు వృథాగా పోయింది. రేతిబౌలి- అత్తాపూర్ మార్గంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ(హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మరమతులు చేపట్టింది. కాగా పైప్‌లైన్ లీకేజీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘మొన్నటి దాకా వరదలు.. ఇప్పుడు ఇక్కడ సునామీ కూడా వచ్చిందా ఏంటీ.. నీళ్లు వృథాగా పోనివ్వకండి. అధికారులు కాస్త శ్రద్ధ వహించండి’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: వచ్చే నెల నుంచి ఉచిత తాగునీరు : కేటీఆర్) మన అత్తాపూర్ లో.. పిల్లర్ నంబర్ 53 దగ్గర.. వాటర్ పైప్ లైన్ పగిలి ఇలా అన్నమాట.. pic.twitter.com/GDICsF3xmV — Phani Kandukuri (@buduggadu) December 19, 2020 -
నదిలో చెలరేగిన మంటలు
గువహతి: అసోంలో ఓ నదికి భారీగా మంటలు అంటుకున్నాయి. దిబ్రూగఢ్ జిల్లాలోని బుర్హిదింగ్ నది కింది భాగం నుంచి వెళ్తున్న ఆయిల్ పైప్ పేలడంతో మంటలు ప్రారంభమయ్యాయి. నది అంతర్భాగంలోని పైప్‌లైన్ పేలిపోవడంతో ఉపరితలంపై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దిబ్రూగఢ్ జిల్లా సహర్కాటియా సమీపంలోని ససోని గ్రామం వద్ద పైప్‌లైన్ నుంచి ఆయిల్ బయటకు వచ్చి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఆయిల్ ఇండియాలిమిటెడ్‌కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైనుకు నదీ తీరంలో లీకవటంతో ఆయిల్ నదిలోకి వచ్చింది. ఇది గమనించిన కొందరు నదీ తీరంలో నిప్పు అంటించి ఉంటారని భావిస్తున్నారు. గత 3 రోజులుగా క్రూడాయిల్ నదిలోకి ప్రవహించి మంటలు వ్యాప్తి చెందుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని నహర్కటియాలోని సాసోని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో నదిలో మంటలు మరింత విస్తృతంగా వ్యాపించి ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
భగీ‘వ్యథ’..
సాక్షి, కొత్తగూడెం: ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం.. భగీ‘వ్యథ’గా మారింది. వరుసగా పైపులైన్లు లీకవుతున్నాయి. ప్రధాన పైపులైన్ తరచూ లీకవుతుండడంతో నీరు భారీగా ఎగసిపడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో తిప్పలు తప్పడం లేదు. పలుచోట్ల పౌరులు గాయాలపాలవుతున్నారు. 16 నెలల క్రితం పైపులైన్ పనుల సమయంలో పాల్వంచ మండలంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అనేక చోట్ల పైపులు లీకవుతూనే ఉన్నాయి. ఇక ఇంట్రావిలేజ్ పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలోని మూలమలుపు వద్ద జాయింట్ వాల్వ్ లీక్ అయి ఇటీవల నీరు ఏరులై పారింది. చండ్రుగొండలోని బొడ్రాయి సెంటర్, మసీదు వద్ద భగీరథ పైపులు పగిలాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఈ నెల 14వ తేదీన మండల కేంద్రంలోని బాలాజీస్వామి ఆలయం ఎదురుగాగల హోటల్ ముందు పైపు పగిలిపోవడంతో హోటల్ ధ్వంసమైంది. రేకులు మొత్తం కూలిపోయి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోయాయి. ఇంట్లోకి మొత్తంనీరు వెళ్లింది. చర్ల మండల కేంద్రంలోని పూజారిగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వారం రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోయి నీళ్లు వృథాగా పోయాయి. కలివేరు, పూజారిగూడెంలలో పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేయగా, కుదునూరులో పగిలిన పైపులైన్‌కు ఇంకా మరమ్మతులు చేయలేదు. ములకలపల్లి మండలంలో మిషన్ భగీరథ పథకంలో గత ఏడాది మే 20వ తేదీన పాల్వంచ నుంచి మండల పరిధిలోని రామచంద్రాపురం వరకు ట్రయల్‌రన్ చేయగా, మాదారం అటవీ ప్రాంతంలో పైపులైన్ లీకయింది. ఫౌంటెన్లా నీరు విరజిమ్మింది. సంబంధిత అధికారులు మరమ్మతులు నిర్వహించారు. 2018 జూలై 31వ తేదీన చుంచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలిపోవడంతో అటుగా వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడటమే కాకుండా ట్రాఫిక్ నిలిచిపోయింది. మిషన్ భగీరథ పైప్‌లైన్ ఒక్కసారిగా లీకై పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు విడుదలయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున నీరు ప్రవహించడంతో రహదారి నీటి ప్రవాహంగా మారింది. పాల్వంచ మండలం జగన్నాధపురం పంచాయతీ తోగ్గూడెం–జగన్నాధపురం గ్రామాల మధ్య మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ పనుల్లో భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో.. 2017 అక్టోబర్ 7వ తేదీన నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు.వారు పైపులు బిగిస్తుండగా వర్షం కురిసింది. ఆ సమయంలో లోతులో పనిచేస్తున్నవారు పైకి వచ్చే పరిస్థితి లేక.. మట్టి పెళ్లలు పడడంతో ముగ్గురూ మృతి చెందారు. -
భగీరథా’.. ఏమిటీ వృథా
తాడూరు: గంగమ్మ నింగికెగిసింది.. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అవడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ సమీపంలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్–కల్వకుర్తి ప్రధాన రహదారి వెంబడి మేడిపూర్ సమీపంలోని ఆదివారం సాయంత్రం భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో నీరు పైకి ఎగజిమ్మింది. నీటి ఉధృతికి దాదాపు 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆకాశానికి ఎగిసిపడుతున్న నీటిని చూసి కొంతమంది వాహనదారులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మేడిపూర్ వాసులు మిషన్ భగీరథ పర్యవేక్షణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని ఎంగంపల్లి చౌరస్తాలోని గేట్‌వాల్వ్ వద్ద నీటిని నిలిపివేశారు. అయినా రెండు గంటల పాటు నీటి ప్రవాహం అలాగే కొనసాగింది. -
పైప్‌లైన్ మరమ్మతుల్లో ఒకరు మృతి
సాక్షి, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద విషాదం చోటుచేసుకుంది. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పైప్‌లైన్ మరమ్మతు పనుల్లో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గూడెం గ్రామానికి చెందిన సాయి(18) పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనుల్లో పాల్గొన్నాడు. పక్కనే ఉన్న మట్టిపెళ్ల అతనిపై పడడంతొ అతను మృతిచెందాడు. ఇతను పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ లక్షెట్టిపేట చౌరస్తా వద్ద మృతదేహంతో అతని కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో చేస్తున్నారు. -
అంతర్వేదికరలో గ్యాస్ పైప్ లైన్ లీక్
-
ఎల్లంపల్లి పైప్‌లైన్ లీక్
ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపురం వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్‌లైన్ లీకేజీ అయింది. ఎయిర్ గేట్ వాల్వ్ ఎగిరిపోవటంతో నీరు 100 అడుగుల ఎత్తులో ఎగసిపడుతోంది. దీంతో సమీప పొలాల్లోకి నీరు వృథాగా పోతోంది. ప్రెషర్ తగ్గిన తర్వాతే మరమ్మతులు చేపట్టడం వీలవుతుందని అధికారులు తెలిపారు. -
కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పట్టణంలో కలుషిత నీరు తాగి చాంద్ పాషా(55) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన సలామియా, రిహాన్‌లను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్వర్, షరీఫ్, గౌస్ మొయినుద్దీన్లను గద్వాల ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఇంటిముందున్న పైప్‌లైన్ లీకేజ్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బాధితులను స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. కారణాలను అడిగి తెలుసుకున్నారు.