భారత నౌకపై సముద్ర దొంగల దాడి
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన వాణిజ్య నౌకపై సముద్రపు దొంగలు దాడిని ఇండియన్ నేవీకి చెందిన స్టెల్త్ వార్‌షిప్ ఐఎన్ఎస్ త్రిశూల్ శుక్రవారం తిప్పికొట్టింది. గల్ఫ్ ఆఫ్ అడెన్‌కు దగ్గరలోని సముద్ర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాణిజ్య నైక జాగ్ అమర్‌ను దోచుకునేందుకు సముద్రపు దొంగల గుంపు దాడికి పాల్పడింది.
దాడికి సంబంధించిన సమాచారం అందుకున్న ఐఎన్ఎస్ త్రిశూల్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. అప్పటికే జాగ్ అమర్‌లో 12 మంది సముద్రపు దొంగలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో త్రిశూల్‌లో ఉన్న మెరైన్ కమాండోలు హెలికాప్టర్ సాయంతో అమర్‌పై దిగారు. అనంతరం సముద్రపు దొంగల నుంచి ఏకే-47, 27 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆఫ్రికా తూర్పు తీరంలో సముద్రపు దొంగల బెడద ఎక్కువగా ఉంటోంది. వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. దీంతో భారత్ తదితర దేశాలు వాణిజ్య నౌకలకు రక్షణగా యుద్ధనౌకలను ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతున్నాయి.