హీరో విశాల్ ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్
చెన్నై : సినీ నటుడు విశాల్ ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం పూజై. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ కారైకుడిలో జరుగుతోంది.
షూటింగ్ పూర్తి కాగానే విశాల్ తాను బస చేసిన హోటల్‌కు వెళ్లి కాసేపు టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు వీక్షించారు. అనంతరం లోకల్ ఛానల్స్ తిలకించిన విశాల్ షాక్ అయ్యారు. ఇటీవలే విడుదలైన రెండు తమిళ చిత్రాలను ఎలాంటి హక్కులు లేకుండా ప్రదర్శిస్తుండడమే. దీంతో విశాల్ కారైకుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు పైరసీకి పాల్పడిన పళ్లత్తూర్ ముహ్మద్ మంజూర్, సంపత్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పైరసీ సీడీల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి రేయింబవళ్లు శ్రమించి రూపొందిస్తున్న చిత్రాలను పైరసీ సీడీల ద్వారా అక్రమంగా లబ్ధి పొండటం నీచమయిన చర్య అన్నారు. వారి న్యాయమైన శ్రమను అక్రమంగా దోచుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)