పీకే చిత్రానికి అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ నటించిన హిందీసినిమా పీకేపై నిషేధం విధించాలని కోరుతూ బజరంగ్దళ్ కార్యకర్తలు బుధవారం కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని రెండు సినిమా హాళ్ల వద్ద వారి ఆందోళన కొనసాగింది. బజరంగ్దళ్ కార్యకర్తలు వసంత్ విహార్‌లోని పీవీఆర్ సినిమా, నంద్‌నగరిలోని గగన్ సినిమా హాలులో పీకే చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. పీకే చిత్రం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని దానిపై నిషేధం విధించాలని బజరంగ్ దళ్ ఢిల్లీ క న్వీనర్ నీరజ్ దనోరియా డిమాండ్ చేశారు. సినిమా హాలులో పీకేను ప్రదర్శించరాదని ఆయన కోరారు. సినిమాను ప్రదర్శించబోమని హాలు యజమాని హామీ ఇచ్చిన తరువాత నిరసన ప్రదర్శన నిలిపివేసినట్లు ఆయన చెప్పారు. పోలీసులు థియేటర్ వద్ద బారికేడ్లను అమర్చి పోలీసు సిబ్బందిని మోహరించారు.
నిరసనకారులు థియేటర్ ఎదుట ఆమిర్‌ఖాన్ దిష్టిబొమ్మలను, సినిమా పోస్టర్లనుతగులబెట్టారు. వారు అరగంటసేపు సుందర్‌నగర్ రోడ్‌పై ట్రాఫిక్‌ను కూడా అడ్డగించారు. ఇదిలా ఉండగా పీకేచిత్ర ప్రదర్శనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతోన్న దృష్ట్యా సినిమా హాళ్లకు అధిక భద్రత కల్పించాలని థియేటర్ల యజమానులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండా, పీకే చిత్రాన్ని సమర్థిస్తూ ఎన్సీపీ కార్యకర్తలు కూడా ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. పీకే చిత్రాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసిన బాబా రాందేవ్, శంకరాచార్య స్వరూపానందల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.