ఎర్రచందనాన్ని శాస్త్రీయంగా గణించాలి
ట్రైనీ ఎఫ్ఆర్ఓల సదస్సులో అడిషనల్ పీసీసీఎఫ్ సారంగి
కడప అర్బన్ : జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట డివిజన్ల పరిధిలో అపారంగా విస్తరించిన ఎర్రచందనాన్ని శాస్త్రీయంగా గణన చేయాలని అటవీశాఖ ప్రణాళిక విభాగం రాష్ట్ర అడిషనల్ పీసీసీఎఫ్ పీకే సారంగి అన్నారు. సోమవారం కడప నగరంలోని పశుసంవర్దకశాఖ జేడీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ట్రైనీ ఎఫ్ఆర్ఓల రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ పీసీసీఎఫ్ పీకే సారంగి, ఇన్‌ఛార్జి వర్కింగ్ ప్లాన్ సీసీఎఫ్ రాజేశ్వరి, అధికారులు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ట్రైనీ ఎఫ్ఆర్ఓలు 43 మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎర్రచందనంపై సమగ్రంగా గణన చేసేందుకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా అడిషనల్ పీసీసీఎఫ్ పీకే సారంగి మాట్లాడుతూ జిల్లాలో 3.14 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించి ఉందన్నారు.
ప్రతి ఎఫ్ఆర్ఓ 0.1 హెక్టారు నుంచి తమ పరిధిలో విస్తరించిన ఎర్రచందనాన్ని శాస్తీయంగా గణన చేయాలన్నారు. ఎంత మేరకు ఎర్రచందనం విస్తరించి ఉంది? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఏ కేటగిరికి చెందినవి? అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి గణన చేయాలన్నారు. మూడు రోజులపాటు ఈనెల 24 నుంచి 26వ తేది వరకు సమగ్రంగా గణన చేసిన తర్వాత ఆయా డీఎఫ్ఓలకు నివేదిక పంపాలన్నారు. అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కడప డీఎఫ్ఓ నాగరాజు, ప్రొద్దుటూరు డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి, బద్వేలు సబ్ డీఎఫ్ఓ వెంకటేశు, జిల్లాలోని ఎఫ్ఆర్ఓలు, ట్రైనీ ఎఫ్ఆర్ఓలు పాల్గొన్నారు.