సీఆర్డీఏలో కొలువుల మేళా!
సాక్షి, విజయవాడ బ్యూరో : సీఆర్డీఏలో త్వరలో కొలువుల మేళాకు తెరలేవనుంది. తొలివిడతగా ఈ సంవత్సరం 300 మంది ఉద్యోగులను నియమించనున్నారు. వీరిని నేరుగా రిక్రూట్ చేసుకోవాలా లేక ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలా? అనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా అయితే ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో నేరుగా నియమించుకునే యోచనలో సీఆర్డీఏ ఉన్నతాధికారులున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
రాజధాని అవసరాలకు అనుగుణంగా సీఆర్డీఏను పటిష్టం చేస్తున్న ప్రభుత్వం కొత్తగా ఇటీవల 778 పోస్టులు మంజూరు చేసింది. వాటిలో 40 శాతం పోస్టులను తొలివిడతగా ఈ సంవత్సరమే భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన పోస్టుల్ని దశల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. 20 విభాగాలకు మంజూరైన పోస్టుల్లో ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 294 కేటాయించారు. ఆ తర్వాత రవాణా, యుటిలిటీస్, మానవవనరులు, ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలకు ఎక్కువ పోస్టులు మంజూరయ్యాయి.
ప్రస్తుతం ఉడా సిబ్బందితోనే సర్దుబాటు
వీజీటీఎం ఉడాలో ఉన్న 69 మంది సిబ్బందితోనే నాలుగు నెలల నుంచి సీఆర్డీఏ పనిచేస్తోంది. డెరైక్టర్, హెచ్ఓడీ స్థాయిలో పలువురు అధికారులను గతంలోనే నియమించారు. ఉద్యోగులను వెంటనే నియమించే పరిస్థితి లేకపోవడంతో ఉన్నవారితోనే ప్రస్తుతం నెట్టుకొస్తున్నారు. పనిభారం ఎక్కువకావడం, ఒత్తిడి పెరుగుతుండడంతోపాటు రాజధాని అవసరాల నేపథ్యంలో ఉద్యోగులను తీసుకోవడం తక్షణావసరంగా మారింది.
దీంతో కొత్తగా 20 విభాగాలు ఏర్పాటుచేయాల్సివుందని, వాటిలో 700 మంది ఉద్యోగులు కావాలని ప్రభుత్వానికి సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఇటీవల నివేదిక పంపారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ దీనిపై మరింత అధ్యయనం చేసి 21 విభాగాలు, 778 ఉద్యోగులు నియమించడానికి అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆ పోస్టుల్ని మంజూరు చేసింది.
విభాగాధిపతుల నియామకం షురూ
20 విభాగాలకు ఉన్నతాధికారులను నియమించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నారు. కీలకమైన 8 ఫంక్షనింగ్ విభాగాలకు డెరైక్టర్ స్థాయి అధికారులను నియమిస్తున్నారు. ప్లానింగ్, డెవలప్మెంట్ కంట్రోల్, రవాణా విభాగాలకు డెరైక్టర్లున్నా యుటిలిటీస్, గృహనిర్మాణం, ఎస్టేట్, ఆర్థికాభివృద్ధి విభాగాలకు డెరైక్టర్లు లేరు. వారికోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు.
విజిలెన్స్, ఐటీ, కమ్యూనికేషన్, స్ట్రాటెజీ, క్వాలిటీ కంట్రోల్, గ్రీవెన్స్ విభాగాధిపతులను నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విభాగాలు, వాటిలోని సిబ్బందిని విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంతోపాటు రాజధాని ప్రాంతంలోని మందడంలో నిర్మించే రాజధాని నగర కార్యాలయంలో పనిచేయించనున్నారు.