పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రికి లేఖ
సాక్షి, సిటీబ్యూరో: జలమండలిలో కొలువుల మేళాకు రంగం సిద్ధమైంది. బోర్డులో దీర్ఘకాలంగా 1480 పోస్టులు ఖాళీగా ఉండడంతో గ్రేటర్ పరిధిలో మంచినీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థ నిర్వహణ, మరమ్మతు పనుల్లో తరచూ జాప్యం జరుగుతుందని, వినియోగదారులకు సకాలంలో సేవలు అందించలేకపోతున్నట్లు బోర్డు యాజమాన్యం తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించినట్లు తెలిసింది. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్‌పై ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీకి సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేయడం విదితమే.
కాగా హోదారీత్యా జలమండలికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి మున్సిపల్ పరిపాలన శాఖ బాధ్యతలు సీఎం వద్దే ఉన్నాయి. ఈనేపథ్యంలో నగరంలో అత్యంత కీలకమైన వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీని తక్షణం చేపట్టేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నట్లు బోర్డు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అయితే మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించాలా..? లేదా అసిస్టెంట్, టెక్నీషియన్ స్థాయి ఉద్యోగాలను బోర్డు యాజమాన్యం ప్రత్యేక పోటీ పరీక్ష నిర్వహించి సొంతంగా భర్తీ చేయవచ్చా..? అన్న అంశంపై ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం ఆధారంగానేస్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
దీర్ఘకాలంగా ఖాళీలే..
జలమండలి బోర్డు 1989లో ఏర్పాటైంది. ప్రారంభంలో బోర్డులో 6111 మంది పనిచేసేవారు. శివారు ప్రాంతాల్లోని 11 మున్సిపల్ సర్కిళ్లు గ్రేటర్‌లో విలీనమవడంతో బోర్డు పరిధి అనూహ్యంగా విస్తరించింది. ప్రస్తుతం 8.34 లక్షల నల్లాలకు జలమండలి మంచినీరు సరఫరా చేస్తోంది. కానీ ఏటా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగుల భర్తీ కాలానుగుణంగా జరగడంలేదు. దీంతో బోర్డు పరిధిలో పలు సేవల్లో అంతరాయం, జాప్యం ఏర్పడుతోంది. ప్రస్తుతం 16 డివిజన్ల పరిధిలో 4631 మంది రెగ్యులర్ ఉద్యోగులు, మరో 1004 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఖాళీగా 1480 పోస్టులున్నట్లు బోర్డు యాజమాన్యం ముఖ్యమంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొంది.
ఈ ఉద్యోగాల భర్తీతో జలమండలి పౌరసేవలు మెరుగవడంతోపాటు ఉద్యోగాల కోసం సుదీర్ఘకాలంగా వేచిచూస్తున్న నగర యువతకు కొలువులు దక్కే భాగ్యం దక్కుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. కొలువుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జలమండలిలో 1480 ఉద్యోగాలు ఖాళీ !
Published Thu, Jun 18 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement
Advertisement