మళ్లీ తెరపైకి 214 సర్వే నంబర్ భూమి
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాకతీయ విశ్వ విద్యాలయ స్థలాల వివాదం మళ్లీ మొదలైంది. మొన్నటివరకు కోర్టు వివాదంలో ఉన్న భూములను సర్వే చేసేందుకు ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విభాగం... యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. కోటగిరి బాబూరావు, వెంకటస్వామి దరఖాస్తు మేరకు హన్మకొండ మండలం కుమార్పెల్లి గ్రామ పరిధిలోని 214 సర్వే నంబర్లో ఉన్న స్థలానికి కొలతలు వేయనున్నట్లు ప్రకటించింది. సంబంధిత అధికారులు శనివారం కొలతలు వేసి.. హద్దులు నిర్ణయిస్తారని నోటీసులో పేర్కొంది. దరఖాస్తుదారులతోపాటు పొతార్ల రాజారాం, యూనివర్సిటీ రిజిస్ట్రార్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఈ నోటీసులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీన ఇచ్చిన నోటీసులకు యూనివర్సిటీ అధికారులు సైతం స్పందించారు.
యూనివర్సిటీ ఆవిర్భావం నుంచి తమ ఆధీనంలో ఉన్న 214 సర్వే నంబర్లోని స్థలాన్ని సర్వే చేయడానికి నిరాకరించారు. యూనివర్సిటీకి మొత్తం 650 ఎకరాల స్థలం ఉందని... సర్వే చేయాలనుకుంటే మొత్తం భూమిని సర్వే చేయాలని తమ అభ్యంతరాన్ని వ్యక్త పరిచారు. మొత్తం భూమిని కొలతలు వేయించి.. అంతకంటే ఎక్కువగా తమ పరిధిలో ఉన్నట్లు తేలితే స్వాధీనం చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.సాయిలు సంబంధిత అధికారులకు లేఖ రాశారు. యూనివర్సిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ సమ్మూలాల్, లీగల్ ఆఫీసర్ రాంచందర్ గురువారం ఈ లేఖల ప్రతులను కలెక్టర్, జేసీ, ఆర్డీఓ, తహసీల్దార్లకు అందించారు.
దీంతో ఈ వ్యవహారం మళ్లీ రాజుకున్నట్లయింది. ఈ సర్వే నంబర్లో తమకు సొంత స్థలం ఉందని.. భూ సేకరణలో యూనివర్సిటీ తమ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ పరిహారం చెల్లించలేదని.. అది తమకే చెందుతుందని ఇద్దరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. ఏకంగా ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదంతా తమ స్థలమేనని.. ఇందులో సర్వేకు అంగీకరించేది లేదని, ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని సహించేది లేదని యూనివర్సిటీ అధికారులు సైతం పట్టుదలతోనే ఉన్నారు. ఈ స్థలాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే కోర్టు కేసులు, ఫీజుల కింద దాదాపు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు యూనివర్సిటీ ఖర్చు చేయడం గమనార్హం. యూనివర్సిటీ స్థలాల ఆక్రమణను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు సైతం పలుమార్లు ఆందోళనలు చేపట్టాయి. ఈ వ్యవహారంలో తెర వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ఉండడం... జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఆయనకు అండదండగా ఉండడంతో రెవెన్యూ అధికారులు ఒత్తిళ్లకు గురవుతున్నారు.
ఒక వైపు కోర్టు వివాదం.. మరోవైపు రాజకీయ జోక్యం మితిమీరిన నేపథ్యంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూముల సర్వేకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ ఆర్డీఓ నుంచి అందిన ఫైలు మేరకు తాము సర్వేకు ఆదేశించినట్లు భూమి కొలతల విభాగం ఏడీ సమీనాబేగం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల లేఖ కూడా అందిందని చెప్పారు.