plan to kill
-
కేసీఆర్ రూపొందించిన సినిమా అట్టర్ ప్లాప్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అంటూ కేసీఆర్ రూపొందించిన సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా... కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైందన్నారు. ఎఫ్ఐఆర్ లేదా రిమాండ్ రిపోర్ట్‌లో ఎక్కడా బీజేపీ నేతలు డీకే ఆరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి పేర్లు లేకపోయినా టీఆర్ఎస్ నేతలు వారిపై ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. గురువారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తామని, మొత్తం వ్యవహారం నిగ్గు తేలేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎన్నికల వ్యూహకర్త పాత్ర ఏమిటి? సీఎం స్వయంగా ఈ కుట్రకు తెరదీశారా? అనే దానిపైనా విచారణ జరపాలన్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రిని కాపాడబోయి సీఎం మరిన్ని తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కొందరు ఐపీఎస్‌లు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధ కలుగుతోందని, ప్రభుత్వం కొమ్ము కాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరైతే మంత్రి అక్రమాలపై పూర్తి ఆధారాలతో కోర్టులు, ఎన్నికల కమిషన్‌ను.. తమ హత్యకు కుట్ర జరుగుతోందని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారో వారే హత్యకు కుట్ర పన్నారంటూ పోలీసులు కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. నిర్మల్‌లో సాజిద్ ఖాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికను డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని ఆశ చూపి అత్యాచారం చేస్తే పట్టుకోడానికి పోలీసులకు వారం రోజులు పడితే, మంత్రి హత్యకు కుట్ర పన్నారంటూ ఒక్కరోజులోనే ఢిల్లీపోయి కొందరిని పట్టుకొచ్చారని అన్నారు. చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి రియాక్షన్ రాష్ట్ర పోలీసుల తీరుపై తాము ఫిర్యాదు చేస్తే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారని, ఈ విచారణను రాష్ట్ర పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కనీస సోయి కూడా లేదా? అని నిలదీశారు. ‘ఢిల్లీలో కిడ్నాప్‌నకు గురైన వారి అకామిడేషన్ నా పేరు మీదే ఉంది. ప్రజల్లో తిరిగే వాళ్లం. ఎవరైనా ఢిల్లీకి వస్తే వాళ్లకు ఆశ్రయమిస్తాం. భోజనం పెడతాం’అని ఒక ప్రశ్నకు సంజయ్ బదులిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రవీంద్రనాయక్, జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. చదవండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర: ‘కిడ్నాప్’ల వ్యవహారంలో సంచలన మలుపు -
పక్కా ప్లాన్‌తోనే పేర్ని నానిపై హత్యాయత్నం
సాక్షి, కృష్ణా: రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నంలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. మంత్రిపై జరిగిన హత్యాయత్నం సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్‌ను పోలీసులు మంగళవారం బయటపెట్టారు. పక్కా పధకంతోనే టీడీపీకి చెందిన నాగేశ్వరరావు.. మంత్రి ఇంటి వద్ద కాపు కాసి దాడి చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. స్కెచ్ ప్రకారమే మంత్రిపై హత్యాయత్నం చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడికావటంతో ఆ సమయంలో నిందితుడు వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో లోతుగా విచారణ సాగుతోందన్నారు. చదవండి: హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్ కాగా, నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తులో వేగం పెంచామని పోలీసులు తెలిపారు. నిందితుడు నాగేశ్వరరావును కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు పేర్కొన్నారు. -
భార్యను చంపేందుకు పోలీసుకే సుపారీ
వాషింగ్టన్: విడాకుల విషయంలో భార్యతో విసిగిపోయిన ఓ భారత సంతతి వ్యక్తి ప్రియురాలితో కలిసి ప్లాన్ వేశాడు. కిరాయి హంతకుడితో చంపించాలనుకున్నారు. కానీ పోలీసులు దొరికిపోయారు. అమెరికాలోని ఇండియానాకు చెందిన నర్సన్ లింగాల(55) తన భార్య నుంచి విడిపోయి ఉంటున్నాడు. అతనికి సంధ్యారెడ్డి(52) అనే ప్రియురాలు ఉంది. ఈ నేపథ్యంలో మిడిలెసెక్స్ కౌంటీ కోర్టుహౌస్‌లో 2018, జూన్‌లో ఓ కేసు విచారణ సందర్భంగా ‘నా మాజీ భార్యను చంపాలి. నీకు ఎవరైనా కిరాయి హంత`కుడు తెలుసా?’ అని సహచర ఖైదీని నర్సన్ అడిగాడు. నర్సన్తో సరే అని చెప్పినా, తర్వాత ఆ విషయాన్ని ఆ ఖైదీ జైలు ఉన్నతాధికారులకు చేరవేశాడు. దీంతో ఓ అండర్‌కవర్ ఏజెంట్ రంగంలోకి దిగాడు. గతేడాది ఆగస్ట్‌లో కిరాయి హంతకుడిలా వచ్చిన పోలీస్ అధికారిని న్యూజెర్సీలోని ఓ షాపింగ్ మాల్లో నర్సన్, సంధ్య కలిశారు. ‘నా జీవితం నుంచి ఆమె(మాజీ భార్య) శాశ్వతంగా వెళ్లిపోవాలి. ఇక ఎప్పుడూ తిరిగి రాకూడదు’ అని నర్సన్ అతడితో చెప్పాడు. ఈ సందర్భంగా భార్య పూర్తి వివరాలను అందించాడు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుందని నర్సన్ అడగ్గా..‘దాదాపు 10,000 డాలర్లు ఖర్చువుతుంది. ముందే డౌన్‌పేమెంట్ ఇవ్వాలి’అని అధికారి అన్నాడు. దీంతో ముందు వెయ్యి డాలర్లు ఇస్తానని నర్సన్ చెప్పాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని రహస్య కెమెరాల ద్వారా పోలీసులు రికార్డు చేశారు. డీల్ ముగిసిన వెంటనే పోలీసులు నర్సన్, సంధ్యలను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేరం రుజువయితే వీరిద్దరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశముంది. -
‘నిర్మలా సీతారామన్‌కి ఇదే ఆఖరి రోజు’
డెహ్రడూన్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంపేద్దామంటూ వాట్సాప్‌లో సందేశాలు పంపుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 66, ఐటీ యాక్ట్ కింద వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌ఘర్ జిల్లాలో మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. రక్షణ మంత్రి పర్యటన నేపథ్యంలో కొందరు ఆమెను అంతమొందించాలంటూ ఓ వాట్సాప్ గ్రూప్‌లో సందేశాలు పంపుకుంటున్నట్లు ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు సదరు వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన సందేశాలను పరిశీలించారు. ‘వాటిలో నేను సీతారామన్‌ని కాల్చేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు’ అంటూ ఓ ఇద్దరు వ్యక్తులు పంపుకున్న సందేశాలు ఉన్నాయి. ఈ మెసేజ్‌లు ఆధారంగా పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తాగిన మైకంలో వారు ఇలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనప్పటికి దీన్ని మాత్రం చిన్న విషయంగా భావించటం లేదని పోలీసులు తెలిపారు. అందుకే వీరిద్దరికి గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అంతేకాక సదరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కోసం కూడా వెదుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఛోటా రాజన్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రాజన్‌ను చంపేందుకు రంగంలోకి దింపిన నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, జునైద్, యూనిస్, మనీశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛోటా రాజన్‌ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని వీరు పథకం పన్నినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఛోటా షకీల్‌తో నిందితులు ఫోన్ సంభాషణలు సాగించినట్టు గుర్తించామని, అనంతరం వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు స్పెషల్ పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) అరవింద్ దీప్ చెప్పారు. జూన్ 3వ తేదీన వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 5 రోజులు పోలీసుల రిమాండ్‌కు అప్పగించారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ కస్టడీకి అదేశించినట్టు అరవింద్ దీప్ చెప్పారు. ఓ నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో ఇండోనేసియాలో అరెస్ట్ అయిన ఛోటా రాజన్‌ను భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.