ఇది మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకర సమయం
భూగ్రహాన్ని సంరక్షించుకునేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలి: హాకింగ్
లండన్: అభివృద్ధి మాటున మానవుడు చేస్తున్న విధ్వంసం తో భూగ్రహం తీవ్ర సంక్షోభా న్ని ఎదుర్కొంటోందని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అన్నారు. మానవజాతి చరిత్రలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన సమయమని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచం అనేక పర్యావరణ, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోందని, భూగ్రహంపై మానవజాతిని సంరక్షించుకునేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం మనం అనేక పర్యావరణ సవాళ్లు, వాతావరణ సమస్యలు, ఆహారధాన్యాల కొరత, అధిక జనాభా, అనేక జాతులు అంతరించి పోవడం, సముద్రాల్లో ఆమ్లశాతం పెరిగిపోవడం వంటి ప్రమాదకర సవాళ్లను ఎదుర్కొంటున్నామని, మానవాభివృద్ధి క్రమంలో మనం అత్యంత ప్రమాదకర దశకు చేరుకున్నామనే విషయాన్ని ఇవి గుర్తు చేస్తున్నాయని హాకింగ్ అన్నారు.
‘మనం నివసిస్తున్న ఈ గ్రహాన్ని నాశనం చేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుతం మనం సమకూర్చుకున్నాం. కానీ దాన్నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని మాత్రం అభివృద్ధిచేసుకోలేకపోయాం. బహుశా మరి కొన్ని వందల ఏళ్ల తర్వాత ఇతర నక్షత్ర మండలాల్లో మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకోగలమేమో.. కానీ ప్రస్తుతా నికి మానవజాతికి ఉన్నది ఒక్క భూగ్రహం మాత్రమే. దీన్ని సంరక్షించుకోవడం అందరి బాధ్యత’ అని ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాకింగ్ పేర్కొన్నారు.