మూడేళ్లు దాటితేనే నర్సరీలో ప్రవేశం
* వయోపరిమితిపై జీఆర్ విడుదల
* ఐదేళ్లు దాటిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం
సాక్షి, ముంబై: నర్సరీ, ప్లే గ్రూప్ విభాగాల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వం నియమ నిబంధనలు ప్రకటించింది. వయో పరిమితి విషయంలో ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనలు వచ్చే విద్యా సంవత్సరం (2015-16) నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం ప్లే గ్రూప్ లేదా నర్సరీలో అడ్మిషన్ ఇవ్వడానికి పాఠశాల యాజమాన్యాలు నిర్దిష్టమైన వయో పరిమితిని అనుసరించడం లేదు. ఈ విభాగంలో అడ్మిషన్లు ప్రైవేటు విద్యా సంస్థల ఇష్టారాజ్యంగా మారిపోయింది. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకుని పాఠశాల యాజమాన్యాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. పాఠశాలల్లో ప్రవేశం పొందే పిల్లల వయో పరిమితిని నిశ్చయించేందుకు ప్రాథమిక విద్యా శాఖ డెరైక్టర్ అధ్యక్షతన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు కొత్త నియమాలతో ప్రభుత్వం జీఆర్ విడుదల చేసింది. ప్లే గ్రూప్, నర్సరీ పిల్లలు ప్రవేశం పొందాలంటే మూడేళ్లు పూర్తిగా నిండాలి. ఐదేళ్లు పూర్తయిన తరువాత ఒకటో తరగతి ప్రవేశం ఇవ్వాలని జీఆర్లో స్పష్టం చేశారు. ఇదివరకు నాలుగేళ్లు పూర్తయిన వారికి ఒకటో తరగితిలో ప్రవేశం లభించేది. కాని ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదేళ్లు నిండితేనే ప్రవేశం లభిస్తుంది. దీన్ని అన్ని విద్యా బోర్డులు అమలు చేయాలని జీఆర్లో ప్రభుత్వం ఆదేశించింది.
నర్సరీలో ప్రవేశం తీసుకునే పిల్లలకు ఆ సంవత్సరం జూలై 31 నాటికి కనీసం మూడేళ్లు పూర్తిగా ఉండాలి. అదేవిధంగా ఒకటో తరగతిలో ప్రవేశం పొందేవారు ఆ సంవత్సరం జూలై 31 నాటికి ఐదేళ్లు పూర్తిగా ఉండాలి. ప్రస్తుతం కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేశాయి. సాధ్యమైనంత వరకు కొత్త జీఆర్ ప్రకారం వారికి అడ్మిషన్లు ఇవ్వాలని విద్యా శాఖ కార్యదర్శి అశ్విని బిడే అన్నారు.