సరదాను హరించిన శారద
భవాని మాల ధరించిన చిన్నారులు
రెండు కుటుంబాలకు ఒక్కక్కరే కొడుకులు చూచుకొండలో విషాదం
స్నానం కోసం శారద నదిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృత్యువాత
మునగపాక:ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులు శారదా నదిలో సరదాగా స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో చూచుకొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చూచుకొండ ఎస్సీ కాలనీకి చెందిన కాండ్రేగుల దార సన్యాసినాయుడు (మణికంఠ, 13) సమీపంలోని గణపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వతరగతి చదువుకుంటున్నాడు. అదే కాలనీకి చెందిన పేలూరి సాయి (14) కూడా అదే హైస్కూల్లో 9వతరగతి చదువుతున్నాడు. దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా ఇద్దరూ అమ్మవారి మాల ధరించారు. బుధవారం ఉదయం మణికంఠ, సాయి, అదే కాలనీలో ఉంటున్న సతీష్ అల్పాహారం తీసుకున్న తరువాత గణపర్తి శారదానది పరివాహక ప్రాంతంలో స్నానం చేసేందుకు ఉదయం 9.45 గంటలకు చేరుకుని నదిలోకి దిగారు. మణికంఠ, సాయి ఇద్దరూ ఒక్కసారిగా నదిలో గల్లంతయ్యారు.
ఇది గమనించిన సతీష్ కేకలు వేయడంతో పక్కనే ఉన్న కొంతమంది గాలింపు చేపట్టారు. కొంతసేపటికి సాయి మృతదేహం లభ్యమైంది. మణికంఠ మృతదేహం కోసం గణపర్తి, మెలిపాక, పూడిమడక గ్రామాలకు చెందిన ఈతగాళ్లతోపాటు ఎస్ఐ హరి, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సుమారు 4 గంటల పాటు గాలించారు. తాళ్లు, ట్యూబ్ల సహాయంతో నదిలో విస్త్రృతంగా గాలింపు చేపట్టగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికంఠ మృతదేహం కూడా కనిపించడంతో ఒడ్డుకు తీసుకువచ్చారు. న దీపరివాహక ప్రాంతం వద్ద ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. నదిలో స్నానం చేస్తున్న సందర్భంలో తాము వారించినా పిల్లలు వినిపించుకోలేదని అక్కడ ఉన్న రజకులు ఆవేదన వ్యక్తంచేశారు.
రెండూ పేద కుటుంబాలే..
మణికంఠ తల్లి ఉమ అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ కంపెనీలో పనిచేస్తుండగా తండ్రి స్థానికంగా మేస్త్రీగా పనులు చేస్తుంటాడు. మణికంఠ అక్క మౌలిక అండమాన్లో ఉంటోంది. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఇలా నదిలో పడి మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు కూడా తట్టుకోలేకపోతున్నారు. సాయి తండ్రి విష్ణు స్థానికంగా క్షౌర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు నదిలో పడి మృతి చెందాడన్న విషయం తెలియడంతో కుటుంబసభ్యుల. ఇద్దరి విగతజీవులను చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఈ సంఘటన పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో నది ఒడ్డకు వందలాదిగా జనం తరలివచ్చారు.
నది ఒడ్డునే పోస్టుమార్టం
శారదానదిలో పడి మృత్యువాత పడిన మణికంఠ, సాయిలకు స్థానికంగానే పోస్టుమార్టం నిర్వహించారు. అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి చెందిన వైద్యులు శారదానది ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హరి చెప్పారు.
శోకసంద్రంలో చూచుకొండ
ఆడుతూ పాడుతూ ఉండే ఇద్దరు చిన్నారులు స్నానానికి వెళ్లి మృతి చెందడంతో చూచుకొండ గ్రామం శోక సముద్రంలో మునిగింది. రెండు కుటుంబాలకు ఒక్కొక్కరే కొడుకులు కావడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
నేతలు, అధికారుల పరామర్శ
ఇద్దరు విద్యార్థులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, అధికారులు బుధవారం గ్రామానికి చేరుకున్నారు. తహశీల్దార్ రాంబాబు, ఎంపీడీఒ శాంతలక్ష్మి, ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, ఎంపీపీ మంజు, ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, చూచుకొండ సర్పంచ్ నరసింగరావు, కర్రి రామనాగేశ్వరరావు తదితరులు మృతదేహాలకు సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు.