దిద్దుబాటు లక్ష్యంగా సీపీఎం ప్లీనం
సాక్షి, హైదరాబాద్: నానాటికీ కుంచించుకుపోతున్న పునాదిని పటిష్టపరిచి పార్టీ పలుకుబడిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు-సీపీఎం) నిర్మాణ ప్లీనం నిర్వహణకు రంగం సిద్ధమైంది. బలం, బలహీనతల గుర్తింపు, దిద్దుబాటుకు ఉద్దేశించిన ఈ ప్లీనంను ఈనెల 27 నుంచి 31 వరకు కోల్కతాలో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 436 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు ‘నిర్మాణంపై రూపొందించిన ముసాయిదా నివేదిక’ను అంశాలవారీగా చర్చించి దిశానిర్దేశం చేస్తుంది.
ఈ సందర్భంగా తొలిరోజున పది లక్షలమందితో బహిరంగసభను నిర్వహించనున్నారు. విశాఖపట్నంలో జరిగిన జాతీయ మహాసభలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్లీనం జరుగుతోంది. 1978 డిసెంబర్లో సాల్కియాలో ప్లీనం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ప్లీనం నిర్వహించడం ఇదే.
ఏపీ కమిటీలో ఫ్యూడల్ భావనలే ఎక్కువ!
ఆంధ్రప్రదేశ్ కమిటీలో మెజారిటీ సభ్యులు ప్రగతిశీల విలువలను పాటించట్లేదని ముసాయిదా నివేదికలో పేర్కొన్నారు. మూఢనమ్మకాలు, కులతత్వం, అభివృద్ధి నిరోధక సంప్రదాయాలు, మహిళల్ని వంటింటి కుందేళ్లుగా చూసే ఫ్యూడల్ భావన ఏపీ కమిటీలో ఉన్నట్టు గుర్తించింది. వీటిని సంస్కరించి పార్టీని గాడిన పెట్టడంపై ప్లీనం దృష్టిపెట్టనుంది. సదస్సుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, తమ్మినేని వీరభద్రంతోపాటు కార్యదర్శివర్గ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు హాజరవుతున్నారు.