ఆడబిడ్డను 'అమ్మే' సింది!
ధన్బాద్ః ముగ్గురు పిల్లలకు మాతృమూర్తి. అయినా మరోకాన్పుకు సిద్ధమైంది. నాలుగోసారి ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. అప్పుడుకానీ ఆమెకు పెంచలేమన్న భయం తెలియలేదు కాబోసు.. కళ్ళుతెరవని పసిగుడ్డును బేరం పెట్టేసింది. పిల్లలు లేని ఓ మహిళకు కేవలం 7 వేల రూపాయలకు పొత్తిళ్ళలో బిడ్డను అమ్మేసింది.
ఆర్థిక దారిద్ర్యం ఆమెను 'అమ్మ'కానికి పురిగొల్పింది. జార్ఖండ్ ధన్బాద్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ళ దులాలీ దేవి తన నవజాత శివువును పాటలీపుత్ర మెడికల్ కాలేజీ (పీఎంసీహెచ్) వద్ద ఓ పిల్లలు లేని మహిళకు 7000 రూపాయలకు అమ్మేసింది. దులాలీ దేవికి అప్పటికే ముగ్గురు సంతానం ఉండగా.. ఆమె నాలుగో ప్రసవంలో పీఎంసీహెచ్ లోని గైనకాలజీ వార్డులో ఒక ఆడ, ఒక మగ సహా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. దీంతో పుట్టిన కవలల్లోని ఆడబిడ్డను దులాలీ దేవి.. పిల్లలు లేని షహీదా కతూన్ కు 7 వేల రూపాయలకు అమ్మేసినట్లు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి (సీడబ్ల్యూసీ) ఛైర్ పర్సన్ నీతా సిన్హా తెలిపారు. ఆర్థిక అవసరాలతో దులాలీ దేవి బిడ్డను అమ్మేసిన సమాచారం తెలుసుకున్న సీడబ్ల్యూసీ జోక్యంతో... 24 గంటలు తిరిగే లోపు బిడ్డ తల్లివద్దకు చేరింది. శిశువును వెనక్కు తెప్పించిన సమయంలోనే షహీదా కనూన్ ను జూలై 21న విచారణకోసం తమ కార్యాలయానికి రమ్మని పిలిచినట్లు సిన్హా తెలిపారు.
మరోవైపు పీఎంసీహెచ్ ఆసుపత్రిలో పసిపిల్లల అమ్మకాలపై ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రారంభ నివేదికల ప్రకారం తమ ఆస్పత్రిలోని సిబ్బందికి అమ్మకాలకు ఎటువంటి సంబంధం లేదని పీఎంసీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ రంజన్ పాండే చెప్పారు. అయితే ఆస్పత్రిలో ప్రస్తుత సంఘటన ఎలా జరిగింది అన్నదానిపై విచారణకు ఆదేశించింది. తన ఐదుగురు పిల్లలను పెంచే స్థోమత లేకపోవడంతోనే బిడ్డను అమ్మే ప్రయత్నం చేసినట్లు దులాలీదేవి ఆస్పత్రి అధికారులు, సీడబ్ల్యూసీ ముందు ఒప్పుకుంది. తన భర్త ఓ రోలింగ్ మిల్లులో పని చేస్తాడని, అతడి ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం చాలడం లేదని.. పొట్ట గడవడంకోసమే తన బిడ్డను అమ్మకానికి పెట్టాల్సివచ్చిందని దులాలీ ఆవేదన వ్యక్తం చేసింది.