ఉత్తరాంధ్రకు భరోసా ‘పీఎం ఉపాధి కల్పన’
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర జిల్లాలలోని నిరుద్యోగ యువతకు ప్రధాన మంత్రి (పీఎం) ఉపాధి కల్పన పథకం భరోసాగా నిలుస్తుందని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) దక్షిణ భారత సభ్యుడు జి.చంద్రమౌళి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం పట్టణానికి మంగళవారం వచ్చిన ఆయన స్థానిక జిల్లా పరిషత్ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. కేవీఐసీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమాన్ని దక్షిణ భారతదేశ మంతటా నిర్వహిస్తామని తెలిపారు.
ఇందులో 180కి పైగా లఘుపరిశ్రమలు ఉన్నాయని, దీని ద్వారా పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది చెందుతుందని చెప్పారు. నిరుద్యోగ యువత ఖాదీ విలేజ్ పరిశ్రమ కమిషన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయనను బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, జిల్లా ఉపాధ్యక్షుడు కుసుమంచి సుబ్బారావు, జిల్లా మువమోర్చా అధ్యక్షుడు మంత్రిప్రగడ విద్యాస్వరూప్, కార్యాలయ కార్యదర్శి రామచంద్రరావు, మైనార్జీ మోర్చా జిల్లా అధ్యక్షుడు షేక్షలీమ్బాషా తదితరులు సత్కరించారు.