పకడ్బందీగా ఏర్పాట్లు
నేటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
అనంతపురం సెంట్రల్ : పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లనిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 19 వరకు నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్వహణలో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో సోమవారం ఉదయం సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 5,697 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. అభ్యర్థులు పీటీసీ తూర్పు గేటు ద్వారా లోపలికి ప్రవేశించి రిపోర్టింగ్ పాయింట్లో రిపోర్టు చేసుకోవాలన్నారు. అనంతరం అభ్యర్థులకు బ్రీఫింగ్ చేస్తారని, ఆ తర్వాత సర్టిఫికేషన్, లగేజీ పాయింట్ వద్దకు పంపడం, బయోమెట్రిక్ ద్వారా సరిచూడటం చేయాలన్నారు. అవి అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీటెస్టులో భాగంగా 1600 మీటర్ల పరుగు, ఆ తర్వాత లాంగ్ జంప్, వంద మీటర్ల పరుగు నిర్వహించాలని సూచించారు. ఎక్కడా కూడా పొరపాట్లు, లొసుగులు జరగరాదన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం కొం దరు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులచే ఉదయం అల్పాహారం కింద బిస్కెట్లు, మధ్యాహ్నం పులిహోరా, పెరుగన్నం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు మల్లికార్జునవర్మ, మహబూబ్బాషా, వెంకటరమణ, నాగసుబ్బన్న, నర్సింగప్ప, చిదానందరెడ్డి, వెంకటరామాంజనేయులు, వెంకటేశ్వర్లు, చిన్నికృష్ణ పాల్గొన్నారు.