PNB stock
-
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. బ్యాంకుకు చెందిన ముంబై బ్రాంచులో భారీగా మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. తన బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ప్రయోజనార్థం ముంబైలోని తమ ఒక బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ నగదును ముంబై బ్రాంచు నుంచి విదేశాలకు పంపినట్టు తెలిసింది. ఈ లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని వినియోగదారుల బ్యాంకు అకౌంట్లకు నగదును పంపినట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఇప్పటికే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు విచారించడం ప్రారంభించాయని పీఎన్బీ తెలిపింది. పారదర్శకతమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకే బ్యాంకు కట్టుబడి ఉందని పీఎన్బీ చెప్పింది. ఈ వార్తల నేపథ్యంలో పీఎన్బీ బ్యాంకు షేరు భారీగా పడిపోయింది. దాదాపు 6 శాతం ఈ బ్యాంకు షేరు క్షీణించింది. -
పీఎన్బీ లాభం 12% వృద్ధి
క్యూ1లో రూ.343 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 12 శాతం వృద్ధితో రూ.343 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ.14,468 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.306 కోట్లు, ఆదాయం రూ.13,475 కోట్లుగా ఉంది. ఆస్తుల నాణ్యత సైతం కొద్దిగా మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 13.75 శాతం నుంచి 13.66 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 9.16 శాతం నుంచి 8.67 శాతానికి దిగివచ్చాయి. దీంతో ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు 19 శాతం తగ్గి రూ.2,559 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఎన్పీఏలకు కేటాయింపులు రూ.3,165 కోట్లు కావడం గమనార్హం. అయితే, మార్చి క్వార్టర్లో ఉన్న స్థూల ఎన్పీఏలు 12.53 శాతం కంటే పెరిగినట్టు తెలుస్తోంది. మెరుగైన ఫలితాలతో పీఎన్బీ స్టాక్ ధర బీఎస్ఈలో ఒక శాతం పెరిగి రూ.158.90 వద్ద క్లోజయింది.