ఆధారమేదీ..
చీరాల, న్యూస్‌లైన్ : దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్దది చేనేత రంగం. అంతటి చరిత్ర ఉన్న చేనేత రంగం నిర్వీర్యమవుతోంది. ‘చేనేత రంగానికి కాలం చెల్లింది. గుంట మగ్గాలు ఇంకెంతకాలం’ అన్న చంద్రబాబు మాటలు మాత్రం నిజం కాలేదు. నేటికీ చేనేత రంగం బతికే ఉంది. అందుకు చేయూతనిచ్చింది వైఎస్ ప్రభుత్వమేనని కచ్చితంగా చెప్పవచ్చు.
చేనేతలకు చంద్రబాబు చేసిందేమిటి?
చేనేత బతుకులను బుగ్గిచేసే పవర్‌లూమ్‌లను ప్రోత్సహించి 2003లో టెక్స్టైల్స్ పార్కులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు కావడంతో చేనేతలకు పనిలేకుండా పోయింది. చేనేతలకు ఆసరాగా ఉండే ఆప్కోకు నిధులు కేటాయించకపోవడంతో చేనేత బట్టకొనుగోలు చేసే దిక్కులేక, చేసేందుకు పనులు లేక అప్పులు, అనారోగ్యాల బారినపడిన కార్మికులు పిట్టల్లా రాలిపోయారు.
చిలుపనూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించడంతో నూలు కొనుగోలు చేయడం నేతన్నకు భారంగా మారింది. ఫలితంగా నూలు కొనలేక మగ్గం నడిచే పరిస్థితి ఉండేది కాదు. దీనిపై చీరాలలో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైల్‌రోకో చేశారు. ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో సైతం ఆందోళన చేపట్టారు. అయినా ఫలితం లేదు.
చేనేతలకు వైఎస్ఆర్ చేసిందిదీ..
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పోచంపల్లి, సిరిసిల్ల వంటి చేనేత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన మొట్టమొదటి సభలో చేనేత రంగానికి చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే వారికి ఆసరాగా నిలిచారు.
- చేనేత రుణమాఫీ కింద జిల్లాలో 1520 మంది లబ్దిదారులకు * 3.23 కోట్ల రుణాలు రద్దు చేశారు.
చంద్రబాబు హయాంలో...
- 2003-04లో రూ.195.37 కోట్లు (చేనేత బడ్జెట్)
- ఏఏవై పథకం లేదు
- 65 ఏళ్లు నిండిన వారికే వృద్ధాప్య పింఛన్, సమష్ట అమ్మక కేంద్రాలు లేవు.
- నూలుపై సబ్సిడీ లేదు, చిలపల నూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ
- ఆప్కో అమ్మకాలు రూ.86.85 కోట్లు
- పింఛన్ 75 రూపాయలు
- జనతా పథకం రద్దు
- నూలు మిల్లుల మూసివేత
- చేనేత మహిళలకు ఒక్క పథకం కూడా లేదు.
వైఎస్సార్ హయాంలో...
- 2008-09లో రూ.325.32 కోట్లు (చేనేత బడ్జెట్)
- 2005-06లో ఏఏవై పథకం అమలు
- 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్
- 2006-07 నుంచి క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం ప్రవేశపెట్టారు
- 200 కోట్ల రూపాయల ఆప్కో అమ్మకాలు, చేనేత పార్కుల ఏర్పాటు
- చేనేతలకు పావలా వడ్డీ రుణాలు
- రూ.312 కోట్ల చేనేత రుణాల మాఫీ
- రంగు, రసాయనాలు, చిలప నూలుపై 10 శాతం సబ్సిడీ
- వీవర్స్ క్రెడిట్ కార్డు ద్వారా వడ్డీలేని రుణాలు
- చిలప నూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ రద్దు
మహానేత మరణం తరువాత...
- చేనేతలకు ప్రత్యేకంగా పరపతి బ్యాంకు ఏర్పాటు చేస్తానన్న కిరణ్ సర్కారు హామీ నెరవేర్చలేదు.
- నూలు డిపోల ఏర్పాటు హామీ కూడా కాగితాలకే పరిమితమైంది.
- మూడేళ్లలో నూలు ధరలు 30 నుంచి 55 శాతం పెరిగాయి. దీంతో చాలా మంది కార్మికులు నూలు కొనుగోలు చేసే శక్తిలేక మగ్గాలను మూలనపెట్టారు.
- వీవర్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకం కూడా అమలుకు నోచుకోలేదు. కార్మికులు నెలకు 80 చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుంది. క్లైంల విషయంలో అనేక ఆంక్షలు విధించడంతో కార్మికులు ఈ పథకానికి దూరంగా ఉన్నారు.
- జిల్లాలో 70 వేల మందికిపైగా చేనేతలున్నప్పటికీ చేనేత క్రెడిట్ కార్డు పథకం కింద 5 వేల మందికి కూడా రుణాలు ఇవ్వలేదు.
- నూలు, రంగులు, రసాయనాలపై పది శాతం సబ్సిడీ వైఎస్ అమలు చేస్తే తరువాత వచ్చే పాలకులు మాత్రం ఆ ఊసే ప్రస్తావించకుండా చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా చేనేతలు అప్పుల్లో కూరుకుని అల్లాడుతున్నారు. ఆదరవునిచ్చే నేత కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చేనేతల కోసం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిందిదీ..
- 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న * 200 పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుతామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు.
- చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు రద్దు చేస్తామని చెప్పారు.
- కిరణ్ సర్కారు రద్దు చేసిన హౌస్ కం వర్క్ షెడ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామని జగన్ ప్రకటించారు.
- కోస్తా తీర ప్రాంతాల్లో ఏటా సంభవించే ప్రకృతి వైపరీత్యాలకు గుంటమగ్గాల్లో పనిచేసే చేనేత కార్మికులకు ఎక్కువ నష్టం జరుగుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు గుంటమగ్గాల స్థానంలో ‘ఫ్రేమ్ లూమ్స్’ను అందజేస్తామని హామీ ఇచ్చారు.
- అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల యూనిఫాంలు, విద్యార్థుల యూనిఫాంలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు.
- అర్హులైన చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1.50 లక్షలతో ఉచితంగా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.