poes garden veda nilayam
-
సీఎం కార్యాలయంగా పోయస్ గార్డెన్
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత నేత జయలలిత నివాసాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చాలని మద్రాస్ హైకోర్టు అక్కడి ప్రభుత్వానికి సూచించింది. అయితే పోయస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం వేదనిలయాన్ని మెమొరియల్‌గా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. పోయస్ గార్డెన్‌ను తాత్కలికంగా తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ని జారీ చేసింది. అయితే తమ అత్తకు చెందిన ఆస్తిపై తమకు హక్కు ఉందంటూ జయలలిత మేనల్లుడు, మేనకోడలు దీపక్, దీపా కోర్టును ఆశ్రయించారు. దీనిపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ ఇటువంటి ప్రైవేట్ ఆస్తులను మెమొరియల్స్‌గా మార్చడం, వాటిని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని కోర్టు పేర్కొంది. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) అందుకే జయలలిత నివాసం వేద నిలయాన్ని ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయంగా మార్చాలని సూచించింది. ఇటువంటి వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడంతో ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించి జయలలిత వారసులకు సమాచారం అందించి అవసరమైతే వారికి డబ్బులు చెల్లించి భవానాన్ని సొంతం చేసుకోవాలని కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. జయలలితకు మేనకోడలు, మేనల్లుడు అయిన దీప, దీపక్‌లు జయలలితకు వారసులు అవుతారు. వారితో మాట్లాడిన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ఇక దీనికి సంబంధించిన విచారణను కోర్టు 8 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిపై నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. (లాక్డౌన్ 5.0 : ఆ 11 నగరాలపై ఫోకస్) -
పోయెస్ గార్డెన్ వద్ద టెన్షన్ : జయ గదులు తెరవొద్దు!
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో ఐటీ, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయమే వేదనిలయానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న శశికళ వర్గీయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పోయెస్ గార్డెన్ పరిసర ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 5 బెటాలియన్ల అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆ రెండు గదులే కీలకం : విశాలమైన వేదనిలయం భవంతిని జయ స్మారక కేంద్రంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే తీర్మానించింది. పొంగల్(సంక్రాంతి)లోపే ఆ కేంద్రాన్ని ప్రారంభించాలనుకున్న సీఎం పళని.. ఆ మేరకు చేయవలసిన పనుల బాధ్యతను చెన్నై కలెక్టర్‌కు అప్పగించారు. అయితే, జయ పర్సనల్ గదులు రెండింటి విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఎందుకంటే.. గతంలో ఐటీ శాఖ వేదనిలయంలో సోదాలు నిర్వహించినప్పుడు ఆ రెండు గదులను సీజ్ చేశారు. వాటిని అలాగే వదిలేసి స్మారక కేంద్రంగా మార్చడం దాదాపు అసాధ్యం. కాబట్టే ఆ గదులను తెరిచే విషయమై ఐటీ, రాష్ట్ర రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ వారు వేదనిలయానికి వచ్చారు. జయ గదుల్ని తెరవొద్దు : సీజ్ చేసిన రెండు గదుల్ని తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలియగానే శశికళ వర్గంలో కలకలం మొదలైంది. పెద్ద సంఖ్యలో పోయెస్ గార్డెన్ వద్దకు చేరుకున్న శశి వర్గీయులు.. ‘అమ్మ గదులను తెరవొద్దు’ అంటూ నినాదాలు చేశారు. ప్రజల దృష్టిలో జయ ఇమేజ్ను దెబ్బతీసేందుకే పళని-పన్నీర్లు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. వేదనిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చినా, అమ్మ నివసించిన గదులను మాత్రం తెరవకుండా అలానే వదిలేయాలని శశికళ వర్గం మొదటి నుంచీ వాదిస్తోంది. ఇంతకీ ఏమున్నాయక్కడ?: జయలలిత బతికున్నప్పుడు వినియోగించిన ఆ రెండు గదుల్లో పలు కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు సమాచారం. గతంలో ఐటీ దాడుల అనంతరం ఆ రెండు గదులను సీజ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఆ గదుల్లోని అన్ని వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికే స్వాధీనం చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. కానీ శశి వర్గం మాత్రం అసలు గదులను తెరవనే తెరవొద్దని ఆందోళన చేస్తోంది. -
నిర్మానుష్యంగా వేద నిలయం
సాక్షి, చెన్నై: మూడు దశాబ్దాల పాటు నిత్య కల్యాణం, పచ్చతోరణ అన్న నానుడికి అద్దం పట్టే రీతిలో సందడిగా ఉన్న పోయెస్ గార్డెన్‌లోని వేదా నిలయం ఇప్పుడు కళ తప్పింది. అమ్మ జయలలిత మరణంతో ఆ ఇంటి పరిసరాలు నిర్మానుష్యం అయ్యాయి. ఆ ఇంట్లో ఎవ్వరు లేని దృష్ట్యా, అన్ని గదులు మూత పడ్డాయి. నిత్యం వంటావార్పుతో బిజిబిజీగా ఉన్న వంట గదికి తాళం పడింది. అన్నాడీఎంకే అధినేత్రిగా, పురచ్చితలైవిగా, తమిళుల అమ్మగా రాజకీయాల్లో జే జయలలిత ఓ వెలుగు వెలిగారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో ఇష్ట పడి పోయెస్ గార్డెన్లో మూడు దశాబ్దాల క్రితం వేద నిలయాన్ని ఆమె నిర్మించుకున్నారని చెప్పవచ్చు. 1991లో సీఎం పగ్గాలు చేపట్టినానంతరం వేద నిలయమే కాదు, పోయెస్ గార్డెన్ అంతా సందడితో నిండి ఉండేది. నిఘా నీడలో, వీఐపీల తాకిడి, అభిమానుల సందడి, కార్యకర్తల హంగామా మధ్య ఆ పరిసరాలు సందడిగా ఉండేవి. పచ్చతోరణం, సుగంధ ద్రవ్యాల సువాసనల మధ్య, పూజాది కార్యక్రమాలు సాగే రీతిలో కళ కళ లాడే వేదా నిలయం నేడు నిర్మానుష్యంగా మారింది. అమ్మ జయలలిత మరణం తదుపరి కొన్ని నెలలు చిన్నమ్మ శశికళ ఆ ఇంట్లో ఉండడంతో వన్నె ఏ మాత్రం తగ్గలేదు. శశికళ కూడా ప్రస్తుతం పరప్పణ అగ్రహార చెరలో ఉండడంతో, ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో అన్న ప్రశ్న బయలు దేరింది. అయితే, ఆ ఇంట్లో ఎవ్వరూ లేదన్న విషయం ప్రస్తుతం తేలింది. ఉన్నత స్థాయి భద్రత పూర్తిగా వెనక్కు తీసుకోవడంతో, మఫ్టీ సిబ్బంది ఒకరిద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు. అమ్మ ఉపయోగించిన గదులు, శశికళ ఉపయోగించిన గదులు, పూజా మందిరం, గ్రంథాలయం, ఇలా అక్కడున్న అన్ని గదుల్ని మూసి ఉన్నట్టు తేలింది. గంభీరంగా దర్శనం ఇచ్చే ఆ ఇంటి ప్రవేశ ద్వారా గేటు మూసి ఉంచారు. ఇద్దరు పని మనుషులు మాత్రం అప్పుడప్పుడు తలుపు తెరచి శుభ్రం చేస్తున్నారు. అమ్మకు, చిన్నమ్మకు సహాయకులుగా ఉండే వాళ్లకు , భద్రతా సిబ్బంది కోసం నిత్యం వంటావార్పుతో సందడిగా ఉండే వంట గది ప్రస్తుతం పూర్తిగా మూత బడింది. భద్రతా సిబ్బంది కోసం ఎదురుగా తీసుకున్న ఉన్న ఓ భవనం సైతం ఖాళీగానే ఉండడం గమనార్హం. జయ జయ నినాదాల నడుమ మిన్నంటిని వేద నిలయం పరిసరాలు ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణంలో మునిగి ఉండడం అమ్మ అభిమానుల గుండెల్ని బరువెక్కిస్తోంది. అలాగే, ఆ పరిసర వాసులకు భద్రత పాట్లు తప్పినా, ఆ ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా ఉండడాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఇక, పోయెస్ గార్డెన్ వైపుగా వెళ్లే రోడ్డు జెడ్ ప్లస్ భద్రత మధ్య ఒకప్పుడు ఉంటే, ఇప్పుడు హోంగార్డుల భద్రత కొనసాగుతోంది.