నిర్మానుష్యంగా వేద నిలయం
సాక్షి, చెన్నై: మూడు దశాబ్దాల పాటు నిత్య కల్యాణం, పచ్చతోరణ అన్న నానుడికి అద్దం పట్టే రీతిలో సందడిగా ఉన్న పోయెస్ గార్డెన్‌లోని వేదా నిలయం ఇప్పుడు కళ తప్పింది. అమ్మ జయలలిత మరణంతో ఆ ఇంటి పరిసరాలు నిర్మానుష్యం అయ్యాయి. ఆ ఇంట్లో ఎవ్వరు లేని దృష్ట్యా, అన్ని గదులు మూత పడ్డాయి. నిత్యం వంటావార్పుతో బిజిబిజీగా ఉన్న వంట గదికి తాళం పడింది.
అన్నాడీఎంకే అధినేత్రిగా, పురచ్చితలైవిగా, తమిళుల అమ్మగా రాజకీయాల్లో జే జయలలిత ఓ వెలుగు వెలిగారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో ఇష్ట పడి పోయెస్ గార్డెన్‌లో మూడు దశాబ్దాల క్రితం వేద నిలయాన్ని ఆమె నిర్మించుకున్నారని చెప్పవచ్చు. 1991లో సీఎం పగ్గాలు చేపట్టినానంతరం వేద నిలయమే కాదు, పోయెస్ గార్డెన్ అంతా సందడితో నిండి ఉండేది. నిఘా నీడలో, వీఐపీల తాకిడి, అభిమానుల సందడి, కార్యకర్తల హంగామా మధ్య ఆ పరిసరాలు సందడిగా ఉండేవి. పచ్చతోరణం, సుగంధ ద్రవ్యాల సువాసనల మధ్య, పూజాది కార్యక్రమాలు సాగే రీతిలో కళ కళ లాడే వేదా నిలయం నేడు నిర్మానుష్యంగా మారింది. అమ్మ జయలలిత మరణం తదుపరి కొన్ని నెలలు చిన్నమ్మ శశికళ ఆ ఇంట్లో ఉండడంతో వన్నె ఏ మాత్రం తగ్గలేదు. శశికళ కూడా ప్రస్తుతం పరప్పణ అగ్రహార చెరలో ఉండడంతో, ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో అన్న ప్రశ్న బయలు దేరింది.
అయితే, ఆ ఇంట్లో ఎవ్వరూ లేదన్న విషయం ప్రస్తుతం తేలింది. ఉన్నత స్థాయి భద్రత పూర్తిగా వెనక్కు తీసుకోవడంతో, మఫ్టీ సిబ్బంది ఒకరిద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు. అమ్మ ఉపయోగించిన గదులు, శశికళ ఉపయోగించిన గదులు, పూజా మందిరం, గ్రంథాలయం, ఇలా అక్కడున్న అన్ని గదుల్ని మూసి ఉన్నట్టు తేలింది. గంభీరంగా దర్శనం ఇచ్చే ఆ ఇంటి ప్రవేశ ద్వారా గేటు మూసి ఉంచారు. ఇద్దరు పని మనుషులు మాత్రం అప్పుడప్పుడు తలుపు తెరచి శుభ్రం చేస్తున్నారు. అమ్మకు, చిన్నమ్మకు సహాయకులుగా ఉండే వాళ్లకు , భద్రతా సిబ్బంది కోసం నిత్యం వంటావార్పుతో సందడిగా ఉండే వంట గది ప్రస్తుతం పూర్తిగా మూత బడింది.
భద్రతా సిబ్బంది కోసం ఎదురుగా తీసుకున్న ఉన్న ఓ భవనం సైతం ఖాళీగానే ఉండడం గమనార్హం. జయ జయ నినాదాల నడుమ మిన్నంటిని వేద నిలయం పరిసరాలు ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణంలో మునిగి ఉండడం అమ్మ అభిమానుల గుండెల్ని బరువెక్కిస్తోంది. అలాగే, ఆ పరిసర వాసులకు భద్రత పాట్లు తప్పినా, ఆ ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా ఉండడాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఇక, పోయెస్ గార్డెన్ వైపుగా వెళ్లే రోడ్డు జెడ్ ప్లస్ భద్రత మధ్య ఒకప్పుడు ఉంటే, ఇప్పుడు హోంగార్డుల భద్రత కొనసాగుతోంది.