poet compound
-
ఒడిశా విశ్వ కవి సమ్మేళనం
ప్రతి ఏటా నిర్వహించే విశ్వ కవి సమ్మేళనం, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు, కళింగ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 39వ సమ్మేళనాన్ని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ వేదికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. 82 దేశాల నుంచి 1,300 మంది కవులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. యునెస్కో అనుబంధంగా ప్రపంచ సాంస్కృతిక మరియు కళల సంస్థలో భాగమైన ఈ విశ్వ కవుల వేదిక (గిఇ్క) 1969లో ప్రారంభమైంది. మనదేశంలో జరుగుతున్న మూడో విశ్వ కవి సమ్మేళనం ఇది. తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం కలగడం తనకు గర్వకారణమని సామాజిక వేత్త, లోక్‌సభ సభ్యులు ప్రొఫెసర్ అచ్యుతా సామంత తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. గత ఏడాది చైనాలో నిర్వహించిన సమ్మేళనంలోకన్నా ఎక్కువ మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కవిత్వం, ప్రపంచ శాంతి దిశగా మానవీయ తత్వపు లక్ష్యాల దిశగా కొనసాగగలదని వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పొయెట్రీ అధ్యక్షుడు డాక్టర్ మారస్ యంగ్ ఆశించారు. గతంలో రెండు ఉత్సవాలను భారతదేశంలో ఎంతో ఘనంగా నిర్వహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. నాటి సభలకు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారనీ, కలామ్ రెండు పుస్తకాలను తాను చైనీస్‌లోకి అనువాదం చేయగా అవి ఎంతో పాఠకాదరణ పొందాయనీ అన్నారు. వేదిక ఉపాధ్యక్షులు, అర్జెంటీనా కవి ప్రొఫెసర్ ఎర్నెస్టో కహాన్, కవులంతా మానవత్వాన్ని ఆపేక్షించే విశ్వ కుటుంబమని కొనియాడారు. ఈ సభలో ప్రసిద్ధ రచయిత రస్కిన్ బాండ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. సమ్మేళనం మొదటి రోజు ఆఫ్రికా, ఫ్రాన్స్, మంగోలియా, జపాన్, చైనా తదితర దేశాల యువ కవులు తమ కవితలను సొంత భాషలోనూ, ఇంగ్లిష్ అనువాదాలనూ వినిపించడం సభలో ఉత్సాహాన్ని నింపింది. సమ్మేళనం రెండో రోజు జరిగిన ప్రారంభ కార్యక్రమంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక సభ్యుల చేతుల మీదుగా తెలంగాణకు చెందిన ప్రముఖ కవి సిద్ధార్థ ఆంగ్ల కవితా సంపుటి జాస్మిన్ వాటర్ (మల్లెల తీర్థం) ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కరుణ ప్రధానంగా సాగిన ఈ సంపుటి ప్రపంచ పాఠకులను ఆకట్టుకోగలదని మారస్ యంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భావావేశాన్ని తెలుగులో పట్టినంత ఉద్వేగంగా ఆ అంతస్సారాన్ని ఇంగ్లిష్‌లోకి కూడా తర్జుమా చేయడంలోనూ సిద్ధార్థ కృతకృత్యులయ్యారు. ఈ కవితా సంపుటిని విశ్వవేదిక మీద ఆవిష్కరించేలా కృషి చేసిన బ్లూజే ప్రింట్స్ నిర్వాహకులు, పాత్రికేయులు, డాక్యుమెంటరీ డైరెక్టర్ రాజా రమేశ్ అభినందనీయులు. -
ముంబై శ్మశానంలో ‘చైతన్య ఝరి’!
సాక్షి, ముంబై: ముంబై నగరంలోని డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ సమాధి ‘చైత్య భూమి’ సమీపంలోని శ్మశానంలో ఆదివారం తెలుగు కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవి, నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. ‘చైతన్య ఝరి’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కవులు అంబేడ్కర్ జీవితంపై, మనిషి జన్మపై, తెలుగు భాషపై కవితలు వినిపించారు. తనికెళ్ల భరణి వినిపించిన కవులు–కౌలు అనే కవితతో పాటు ఆయన ఆలపించిన ‘ఆటగదరా శివా.. ఆట కదా కేశవా’అనే శివ తత్వాలు అలరించాయి. మనిషిలోని అహం పూర్తిగా సమసిపోయేది శ్మశానంలోనేననీ, సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన కవులు ముందుగా తమలోని అహాన్ని విడనాడాలనే సత్సంకల్పంతో శ్మశానంలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశామని సాహిత్య విభాగ ఉపాధ్యక్షుడు సంగెవేని రవీంద్ర చెప్పారు. కార్యక్రమంలో అంబేడ్కర్ మనవడు ఆనంద్‌రాజ్, పొన్నూరి భారత లక్ష్మి, నడిమెట్ల యెల్లప్ప, ఆంధ్ర మహాసభ ట్రస్టీలు వాసాల శ్రీహరి, మహిళా శాఖ కార్యదర్శి సోమల్ లత పాల్గొన్నారు. -
కళాకారులది నిర్మాణాత్మక పాత్ర
- రవీంద్రభారతిలో కవి సమ్మేళనం - కొత్తసాలు పుస్తకావిష్కరణ నాంపల్లి: తెలంగాణలో కవులు, కళాకారులు, రచయితలకు కొదవ లేదని, చరిత్రలో వారునిర్మాణాత్మకమైన పాత్రలను పోషించారని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్ర భారతి వేదికపై రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చెందిన 400 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. పద్య, వచన కవులతో పాటు ఆశు కవులు కూడా భాగస్వాములై సదస్సును విజయవంతం చేశారు. తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా చాటుతూ ప్రతి భను కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, తెలుగు విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, జాతీయ సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య ఎన్.గోపితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కవి సమ్మేళనాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య నేపథ్యాన్ని భావితరాలకు తెలియజేయటం కోసం కవి సమ్మేళనాలు దోహదపడుతాయన్నారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ ఉద్యమనేత రాష్ట్ర పాలకుడైతే రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్రం ఎంత అలరారుతుందో సీఎం కేసీఆర్ ఈ ఉత్సవాల నిర్వాహణ ద్వారా నిరూపించారని అన్నారు. ఆచార్య ఎన్.గోపి తొలి కవితను వినిపించి కవి సమ్మేళనానికి శ్రీకారం చుట్టారు. కవి ఆచార్య అనుమాండ్ల భూమయ్య పద్య గానంతో సభికులను ఆకట్టుకున్నారు. ప్రారంభోపన్యాసం చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను నభూతో నభవిష్యతి అన్న చందాన నిర్వహించామని అందుకు సహకరించిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమ్మేళనం విజయవంతమైన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి ప్రముఖ కవులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య, జూలూరి గౌరీ శంకర్, తూర్పు మల్లారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, జూపాక సుభద్ర తదితరులు అధ్యక్షత వహించారు. అనువాద కవులను రాష్ట్ర సాంస్కృతిక శాఖ పక్షాన ఘనంగా సత్కరించారు. తొలుత రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రపంచ కవితా దినోత్సవంలో పాల్గొన్న కవులు అందించిన కవిత్వాలతో పొందుపరిచిన ‘కొత్తసాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా నగరంలోని రవీంద్రభారతిలో కవి సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 400 మంది కవులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన పలువురు కవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 'కొత్తసలు' పుస్తకావిష్కరణ చేశారు.