విభజన రాజకీయాల అడ్డాగా అమెరికా
అమెరికా ఇటీవలి జ్ఞాపకాల్లో కనీవినీ ఎరగనంత స్థాయిలో ఓటర్లను నిలువునా చీల్చివేసిన తాజా ఎన్నికలు దాని ముగింపును కూడా అంతే విభజనతో లిఖించేటట్లు కనబడుతోంది. ప్రపంచంలో అమెరికా స్థాయిని, దాని విలువను తగ్గించే పర్యవసానాలను ఈ విభజన తీసుకొచ్చేటట్టుంది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతూనే ఉంది. ఫలితాల వెల్లడి ప్రారంభమైన తొలిరోజే ఏమాత్రం ఆగలేక తానే గెలిచానని ప్రకటించేసుకున్న దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థులు ఎన్నికల ఫలితాలను తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు.
అమెరికా ప్రజాస్వామ్య సుదీర్ఘకాల ఆరోగ్యం, చట్టబద్ధత గురించి తనకు ఏమాత్రం పట్టింపులేదని నిరూపించుకుంటూ వచ్చిన దేశాధ్యక్షుడు ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి తిరస్కరించడాన్ని ప్రపంచం దిగ్భ్రాంతితో చూస్తోంది. అధ్యక్షుడి అధికారాలను పక్కన బెడితే, రిపబ్లికన్ పార్టీపై ట్రంప్ ప్రస్తుతం చలాయిస్తున్న, భవిష్యత్తులో చలాయించగల ఆధిపత్యం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్లయింది. అలాగే ఆర్థికంగా, చట్టపరంగా తాను ఎదుర్కొనబోయే సమస్యలనుంచి తప్పించుకోవడానికి ట్రంప్ తన ఆధిపత్య స్థాయిని ఉపయోగించే సామర్థ్యం కూడా క్షీణించిందనే చెప్పాలి. ఓటమిని ట్రంప్ హుందాగా అంగీకరించి తప్పుకునే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైనట్లేనని చెప్పాల్సి ఉంటుంది.
బ్యాలెట్లలోని ఓట్లన్నీ లెక్కించాక జో బైడెన్‌కే గెలుపు అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తూండవచ్చు కానీ, బైడెన్ ఓడిపోతే మాత్రం డెమొక్రాటిక్ మద్దతుదారులకు అది పెనుదెబ్బ అయ్యే అవకాశం ఉంది. వీరిలో చాలామంది బైడెన్ ఓడిపోయినట్లతే మాత్రం ఈ ఎన్నికలు తమకు వ్యతిరేకంగా జరిగిన రిగ్గింగ్ ఫలితమేనని కూడా భావిస్తారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్నదాంతో పని లేకుండా, 2020వ సంవత్సరంలో ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏ ప్రజాస్వామ్యం కూడా అమెరికాలాగా రాజకీయంగా ఇంతగా వేరుపడిపోయిన పాపాన పోలేదు. ఎన్నికల ఫలితాలపై ముందస్తు అంచనాలకు మించి ట్రంప్ ప్రదర్శించిన అతి చర్యలు, అమెరికా ఓటర్లలో వచ్చిన ఈ విభజనను రాజకీయ పండితుల అంచనాల వల్ల కలిగిన ఫలితంగా కాకుండా అత్యంత వ్యవస్థీకృతంగానే జరిగిన పరిణామమని చెప్పాల్సి ఉంటుంది.
ఎన్నికల ఫలితాన్ని ఇరు పక్షాల్లో ఏదీ సత్వరమే అంగీకరించబోవడం లేదన్న వాస్తవాన్ని పక్కనబెట్టి చూస్తే, ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. అమెరికా నిరంకుశ రాజ్య వ్యవస్థగా మారిపోనుంది. ఇటీవలి కాలంలో కాస్త బలహీనపడినట్లు కనబడుతున్నప్పటికీ, అమెరికాలోని ప్రజాస్వామ్య సంస్థలు క్రమక్రమంగా.. ప్రభుత్వ విధానాల్లో ప్రజల ప్రత్యక్ష ఇచ్ఛను ప్రతిఫలించే కెనడా లేక జర్మనీ తరహా నిజమైన ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థనుంచి రానురానూ పక్కకు పోతున్నాయి. పైగా హంగరీ, టర్కీల్లాగా అమెరికా ఒక హైబ్రిడ్ రాజకీయ వ్యవస్థ దిశగా సాగిపోతోంది. ఇది పూర్తి నియంతృత్వ వ్యవస్థ అంతటి చెడ్డది కాకపోయినప్పటికీ, అమెరికా మాత్రం ఆ దశవైపే ప్రమాదకరంగా సాగిపోతోంది.
అంతిమంగా ఈ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసేది ఎవరు అనేదాంతో పనిలేకుండా, గత 50 ఏళ్లతో పోల్చి చూస్తే స్వదేశంలో రాజకీయపరంగా కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఉనికి పరంగా గానీ ఎన్నడూ లేనంత బలహీనంగా అమెరికా రాజకీయ ప్రమాణాలు పడిపోయాయి. దేశీయంగా చూస్తే, రాజకీయ ప్రక్రియలు, స్వేచ్ఛా వ్యాపారం, వలస సమస్య వంటి విధానపరమైన అంశాలపై వాదనలు, చర్చలు మినహా, దేశాన్ని వేరుపర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక సోషల్ మీడియా సైతం విభిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన అమెరికన్లను విడదీసి వేరుచేసే ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది.
దేశీయంగా ఇలా వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం అనేది.. వాతావరణ మార్పు, టెక్నాలజీ క్రమబద్ధీకరణ వంటి కీలకమైన అంశాల్లో అమెరికా ఆధిపత్యాన్ని కష్టసాధ్యం చేస్తోంది. లేదా వాణిజ్యం, భద్రత వంటి సంక్లిష్ట అంశాల్లో ఐక్య సంఘటనతో చైనాకు వ్యతిరేకంగా నిలిచే శక్తి కూడా అమెరికాలో తగ్గుముఖం పడుతోంది. చివరకు బైడెన్ అధ్యక్ష స్థానం చేజిక్కించుకున్నప్పటికీ, రిపబ్లికన్ల ఆధిపత్యంలో ఉండే సెనేట్ను తాను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో విదేశీ విధానంపై రాజకీయంగా ఎంత సమర్థంగా బైడెన్ వ్యవహరిస్తారన్నది ప్రశ్నార్థకమే.
అమెరికా నుంచి స్ఫూర్తిదాయకమైన, రాజనీతిజ్ఞత కలిగిన ఎన్నికలకోసం తక్కిన ప్రపంచం ఎదురుచూస్తోంది. కానీ స్వదేశంలోనూ, విదేశాల్లోనూ వచ్చే నాలుగేళ్లలో అమెరికా రాజకీయాలు గత 50 ఏళ్ల కాలంలో ఉన్న స్థాయిని అందుకోవడం కాకుండా ట్రంప్ నాలుగేళ్ల పాలనలోని ఫలితాలనే సాగించేటట్టు కనబడుతోంది.
-ఇయాన్ బ్రెమ్మర్, కాలమిస్ట్