కొడవలూరు, న్యూస్‌లైన్: రాహుల్ గాంధీకీ నాయకత్వ లక్షణాలు ఉంటే దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ ఉపసంహరించుకున్న విధంగా రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలోని వైఎస్సార్ కూడలిలో సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం నిరాహారదీక్ష చేస్తున్న వారిని కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీ మేకపాటి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని చీల్చాలని తలపెట్టిన ఆలోచన దుర్మార్గం అన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డిని 16 నెలలు జైలులో నిర్బంధించి సీబీఐ విచారణల పేరుతో కాలయాపన చే శారన్నారు. ఆయనకు బెయిలు లభిస్తే సోనియాగాంధీకి తాము కృతజ్ఞతలు చెప్పామని కొందరు మాట్లాడడం దారుణమన్నారు. చంద్రబాబు లాంటి అబద్ధాల కోరు ఎవరూ లేరన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లి రాజకీయపబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. కేంద్రానికి లేఖ ఇచ్చి సీమాంధ్రులకు అన్యాయం చేయాలని బాబు కంకణం కట్టుకున్నాడన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కన్వీనర్లు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు కానీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
సమైక్యాంధ్రకు కట్టుబడ్డాం
కావలి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌ను కేబినెట్‌లో గురువారం ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ రోడ్డుపై రిలేదీక్షతో పాటు రాస్తారోకో నిర్వహించింది. అదే సమయంలో ఆ మార్గంలో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్‌తో కలిసి కావలికి వచ్చిన ఎంపీ మేకపాటి వారి నిరసనకు సంఘీభావం తెలిపారు.
సమైక్యాంధ్రపై వైఎస్సార్‌సీపీ అభిప్రాయం ఏంటని ఎంపీని ఉద్యోగ జేఏసీ నేతలు ప్రశ్నించారు. మేకపాటి స్పందిస్తూ తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారన్నారు. పార్లమెంట్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డును వైఎస్ జగన్ పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో సీమాంధ్రలో చంద్రబాబు చేపట్టిన పర్యటనను అడ్డుకుంటామని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఎంపీ ఎదుట స్పష్టం చేశారు. అలాగే సమైక్యాంధ్రకు కట్టుబడిన వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తామన్నారు.
రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలి
Published Fri, Oct 4 2013 4:26 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement