సాక్షి, విజయవాడ : దొంగల ముఠాతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో స్నేహం చేయడం ద్వారా రాహుల్ రాజకీయంగా మరణించినట్లేనని ఘాటుగా విమర్శించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ నేతలే చార్జిషీట్ విడుదల చేశారని, అటువంటి వ్యక్తితో ఇప్పుడు ఎలా జతకడతారని ప్రశ్నించారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను చెరో పక్క కూర్చోబెట్టుకున్న రాహుల్‌కు తమ నాయకులపై విమర్శలు చేసే అర్హత లేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మనుమడు ఇంత దౌర్భాగ్యపు వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని, గాంధీ- నెహ్రూల వారసత్వం ఇంతకు దిగజారుతుందనుకోలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ కుటుంబం గురించి జాగ్రత్తగా మాట్లాడాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు. ఈ సందర్భంగా కొన్ని దొంగ పత్రికల ద్వారా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.
సీబీఐ అంటే మీ పార్ట్‌నర్‌కు భయం..
తమ పార్టీకి నిజంగా బీజేపీతో సంబంధాలు ఉండి ఉంటే తమ నాయకుడిపై కేసులు ఉండేవా సుధాకర్ బాబు అని ప్రశ్నించారు. మహానేత వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ పైకి సీబీఐని ఉసిగొల్పినా ఆయన భయపడలేదని అన్నారు. వైఎస్సార్ మరణం తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతే వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు ఆ కుటుంబాలను ఓదార్చారని గుర్తు చేశారు. మీ పార్ట్‌నర్ చంద్రబాబుకే సీబీఐ అంటే భయమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 33వేల ఎకరాల రైతుల భూములు కాజేసిన చంద్రబాబు ని పక్కనబెట్టుకున్న రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణ ఘనత వైఎస్సార్‌దేనని, ఈ విషయంపై అనుమానాలు ఉంటే మీ తల్లి సోనియా గాంధీని అడగాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment