'ఆ విషయం రాహుల్ తెలుసుకోవాలి'
ఒంగోలు: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీని విమర్శించే నైతిక హక్కు రాహుల్కు లేదని అన్నారు.
అజ్ఞాతంలోకి వెళ్లి తిరిగొచ్చిన రాహుల్కు ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాల గురించి ఏం తెలుసునని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంపై పోరు మొదలెట్టిందే వైఎస్ఆర్ సీపీ అని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలందరినీ కలసి ప్రత్యేక హోదాపై చర్చించిన విషయం రాహుల్ తెలుసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ప్రత్యేక హోదా అంశాన్నిచట్టంలో చేర్చాలని రాహుల్కు తెలియదా అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రైతుల సమస్యలు రాహుల్కు ఇప్పుడే గుర్తుకొచ్చాయా అని నిలదీశారు. రాహుల్ విమర్శలు మానుకుని ఏపీకి కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు.
ఒంగోలులో మున్సిపల్ కార్మికుల ధర్నాలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 16 రోజులుగా కార్మికులు ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులతో ప్రభుత్వ పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.