బీమాతోనే చదువుకు ధీమా!
తల్లిదండ్రుల లక్ష్యాల్లో పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించడమనేదే ఇప్పుడు ప్రధానం. ఈ మధ్య అవైవా, ఐఎంఆర్బీ కలిసి భారతీయ పొదుపు గురించి చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. పొదుపు చేస్తున్న వారిలో 93 శాతం మంది వారి పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నామని చెప్పగా, 77 శాతం మంది పెరుగుతున్న విద్యా వ్యయంపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ బీమా పథకాలు చక్కటి సమాధానం చెపుతాయి. బీమా అనేది కేవలం ఆర్థిక రక్షణగానే కాకుండా వివిధ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగానూ మారింది. ముఖ్యంగా పిల్లల అవసరాలకై ఇప్పుడు అనేక బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి.
పుట్టిన వెంటనే...
తల్లిదండ్రులు వారి పిల్లలను డాక్టరో, ఇంజనీరో లేక పైలట్టో చేయాలనుకుంటారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే వారికి మంచి విద్యను అందించాలి. దీనికి తగినంత నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలు పుట్టగానే ఆ దిశగా అడుగులు వేస్తే తక్కువ మొత్తంతోనే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల కోసం రూ.10 లక్షల నిధిని సమకూర్చుకోవాలంటే మొదటి సంవత్సరంలోనే ప్రారంభిస్తే ఏటా రూ.39,771 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అదే ఏడేళ్ళ తర్వాత మొదలు పెడితే ఇదే మొత్తానికి ఏటా రూ.82,045 చెల్లించాల్సి ఉంటుంది. అంటే అదనంగా ఏటా మరో రూ.42,274లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత తక్కువ మొత్తంతో లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాం.
నాలుగు మార్గాలు
నాలుగు మార్గాలను అనుసరించడం ద్వారా పిల్లల ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.
స్టెప్ 1: ముందుగా పిల్లల ఉన్నత చదువు లేదా భవిష్యత్తు అవసరాల కోసం ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కించుకోండి.
స్టెప్ 2: ఇక రెండో దశలో ఎంత బీమా రక్షణ అవసరమవుతుందో చూసుకోవాలి. జీవితంలో ఏదైనా ఊహించని సంఘటన జరిగినా పిల్లల భవిష్యత్తు, ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం లేకుండా ఉండే విధంగా బీమా రక్షణ ఎంచుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు ఇందుకోసం ప్రత్యేకమైన రైడర్లను అందిస్తున్నాయి.
స్టెప్ 3: ఈ లక్ష్యం చేరుకోవడానికి ఎంత కాలపరిమితి ఉంది, ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది, దీన్ని ఎంత మొత్తంలో చెల్లించగలం అన్నది పరిశీలించండి.
స్టెప్ 4: చివరగా మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా బీమా పథకాన్ని ఎంచుకోండి. రిస్క్ చేయగలి గితే యులిప్ పథకాలను, లేకపోతే సంప్రదాయ బీమా పథకాలను ఎంచుకోండి.
పలు బీమా పథకాలను పిల్లల వయస్సు 18 లేదా 21 సంవత్సరాలు వచ్చేసరికి నగదును అందించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో మీకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఈ విధంగా పిల్లలు పుట్టగానే వారికోసం ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకుంటే ఎటువంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా సులభంగా లక్ష్యాన్ని చేరుకోగలరు.