మోదమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు
పాడేరు,న్యూస్లైన్: మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కురుసా నాగభూషణం, బత్తిన కృష్ణ, సర్పంచ్ కిల్లు వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ఏర్పాట్ల వివరాలను విలేకరులకు వెల్లడించారు.
ఆదివారం ఉదయం 6 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను అమ్మవారి ఆల యం నుంచి తోడ్కొని వెళ్లి మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన సతకంపట్టు వద్ద ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఏ రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానిం చడం లేదని స్థానిక భక్తులే ఉత్సవాలకు ముఖ్య అతిథులన్నారు. పట్టణం అంతా విద్యుత్ దీపాలంకరణ ఈ ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణ అని వారు తెలిపారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులతోను సమన్వయం చేశామన్నారు. ఉత్సవాల విజయవంతానికి ఐటీడీఏ కూడా సహకరిస్తుందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజనుల సంప్రదాయ కళా ప్రదర్శనలు కూడా ఉంటాయన్నారు. ఉత్సవాల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాల చివరి రోజైన మంగళవారం అమ్మవారి అనుపు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు.
అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలను ప్రతి భక్తుడు నెత్తిన పెట్టి మోసే విధంగా అవకాశం కల్పిస్తామని ఈ మేరకు రోప్వే సౌకర్యాన్ని కూడా ఈ ఏడాది వినూత్నంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాలతో పాడేరు పట్టణ వాసులకు అదనంగా గ్యాస్ సిలిండర్ సౌకర్యంతో పాటు అన్ని వీధుల్లోను ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు ఐటీడీఏ పీఓ చర్యలు తీసుకున్నారని, పారిశుద్ధ్య చర్యలు కూడా చేపడతామని చెప్పారు.
ఉత్సవాల విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతి నిధులు పలాసి కృష్ణారావు, రొబ్బా నాగభూషణరాజు, బాణం శ్రీనివాసదొర, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, ఎల్.అప్పారావు, కొట్టగుల్లి రాజారావు, తాంగుల రంగారావు, మర్రిచెట్టు రామునాయుడు, సల్లా రామకృష్ణ, రామిరెడ్డి, ఆటో ఈశ్వరరావు, గోపి పాల్గొన్నారు.
ఆలయానికి ఉత్సవ శోభ
మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి ఉత్సవ శోభ నెలకొంది. ఇటీవల అమ్మవారి విగ్రహానికి కొత్తగా రంగులు వేయడంతో అమ్మవారు మరింత ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవాలతో అమ్మవారి ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో మరింత శోభాయమానంగా భక్తులకు కనువిందు చేస్తుంది. ఉత్సవాలకు రెండు రోజుల ముందుగానే అమ్మవారి ఆలయం దీపాలంకరణతో కళకళలాడుతుంది.