యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్ : పురాతన కాలం నుంచి బలహీనవర్గాలకు, దళితులకు రాజ్యాధికారం దక్కడం లేదని, రెండుమూడు కులాల వారే పెత్తనం చెలాయిస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్వీయూనివర్సిటీలో మహాజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగిన మహాజన సోషలిస్టు పార్టీ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. రాయలసీమలో ఎస్టీలకు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రిజర్వు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రతి రాజకీయ పార్టీ 50 శాతం సీట్లు బలహీనవర్గాలకు కేటాయించాలని సూచించారు. రాయలసీమకు చెందిన రాజకీయనాయకులే సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు.
రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించి రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సూచించిన మేరకు తాము చిన్న రాష్ట్రాల అంశానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 2001లో ఎమ్మార్పీఎస్ స్థాపించిన సమయంలోనే ఈ తీర్మానం చేసినట్టు వెల్లడించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ, 2009లో టీడీపీలు తమ మ్యానిఫెస్టోలో ప్రత్యేక తెలంగాణ అంశాన్ని చేర్చాయని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నాయని గుర్తుచేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ ఆల్మెన్‌రాజు, ఎంఎస్‌ఎఫ్ నాయకులు వెంకటస్వామి, బీసీ సంఘం నాయకులు గోవిందు, భాస్కర్‌యాదవ్, హేమాద్రియాదవ్ పాల్గొన్నారు.
నగరంలో బైక్ ర్యాలీ
మహాజన సోషలిస్టుపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ నగరంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. పద్మావతి అతిథిగృహం నుంచి బాలాజీ కాలనీ, ప్రకాశంరోడ్డు, గాంధీరోడ్డు, తిలక్‌రోడ్డు, భవానీనగర్, రాజన్నపార్కు మీదుగా ఎస్వీయూ వరకు ర్యాలీ సాగింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు.
పెత్తనం కొందరిదేనా?
Published Tue, Jan 21 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement