Pon Radha Krishnan
-
రజనీకాంత్‌తో బీజేపీ పొత్తు..!
సాక్షి, చెన్నై : నటుడు రజనీకాంత్‌తో పొత్తు గురించి బీజేపీ మాజీ కేంద్ర సహయమంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పందించారు. నటుడు రజనీకాంత్ ఇంకా పార్టీని ప్రారంభించలేదు. అయినా ఆయన పెట్టే పార్టీ గురించి, ఏ పార్టీలో పొత్తు అనే విషయాల గురించి చాలా కాలంగానే రకరకాల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక పక్క రజనీ బీజేపీ మద్దతుదారుడనే ముద్ర ఉండనే ఉంది. అయితే మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, రజనీకాంత్ చిరకాల మిత్రుడు కమలహాసన్ ఆయనతో పొత్తు పెట్టుకుని రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. (చదవండి: శభాష్ మిత్రమా రజనీకాంత్: కమల్‌హాసన్) ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మాజీ కేంద్ర సహాయమంత్రి పోన్ రాధాకృష్ణన్ ఆదివారం చెన్నై విమానాశ్రమంలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పౌరసత్వ బిల్లు గురించి రాష్ట్రముఖ్యమంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పౌరసత్వ బిల్లు వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శాసనసభలో పేర్కొన్నారన్నారు. అయితే మీడియా పదే పదే దాని గురించి అడగడంతో అవసరం అయితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసే విషయమై పరిశీలిస్తామని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చునని అన్నారు. రజనీకాంత్‌తో బీజేపీ పొత్తు గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ముందు రజనీకాంత్‌ను పార్టీ పెట్టనీయండి అన్నారు. ఆయన పార్టీ జెండా, అజెండా ఏమిటో వెల్లడించాలని, ఆ తరువాత రజనీతో పొత్తు గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇక నటుడు కమలహాసన్ విషయానికి వస్తే ఆయన ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇది సినిమాను నిర్మించడం కాదని, తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమైన అంశం అని అన్నారు. 50 ఏళ్లుగా తమిళనాడు ఎలాంటి అభివృద్ధి లేకుండా వెనుకపడిపోయిందన్నారు. దాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికలు చాలా కీలకం అన్నారు. అన్నాడీఎంకే పార్టీని రాజ్యసభ సీటును కోరతారా అన్న ప్రశ్నకు దాని గురించి ఇంకా ఆ పార్టీని అడగలేదని, అలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా అన్నది తనకు తెలియడం లేదని అన్నారు. అయితే 2021లో జరగనున్న ఎన్నికలకు ఇతర పార్టీల మాదిరిగానే బీజేపీ పార్టీ తయారవుతోందని పోన్ రాధాకృష్ణన్ అన్నారు. రజనీ పార్టీలో ఉపాధ్యక్షుడినవ్వాలనుంది కాగా నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ గురించి తెలియనివారుండరు. ఎందుకంటే అతను నటుడిగా కంటే కూడా వివాదాలతో చాలా పాపులర్. పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయన ఒక సినిమా వేదికపై మాట్లాడుతూ తన గురించి చాలా అసత్య ప్రచారం జరుగుతోందన్నాడు. తాను చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఎదుగుతున్నానని అన్నారు. తాను నటుడు రజనీకాంత్‌కు చెప్పేదొక్కటేనని, ఆయన పార్టీని ప్రారంభిస్తే తనను అందులో చేర్చుకోవాలని అన్నాడు. తనకు రజనీ పార్టీలో ఉపాధ్యక్షుడిని కావాలన్న ఆశ ఉందన్నాడు. లేదంటే తానే సొంతంగా పార్టీని ప్రారంభిస్తానని పవర్‌స్టార్ శ్రీనివాసన్ పేర్కొన్నాడు. రజనీతో ముస్లిం మత గురువులు భేటీ కాగా పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లు కారణంగా ముస్లింలకు ఎలాంటి బాధ ఉండదని, అలా ఏదైనా ఉంటే ముందుగా తానే వ్యతిరేకిస్తానని నటుడు రజనీకాంత్ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా శనివారం హజ్ కమిటీ అ«ధ్యక్షుడు అబూబక్కర్ నటుడు రజనీకాంత్‌ను స్థానిక పోయెస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి వద్ద కలిశారు. పౌరసత్వ బిల్లు వల్ల ముస్లింలకు ఎలాంటి బాధ ఉండదని హామీ ఇచ్చిన రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలపడానికే తాను ఆయనతో భేటీ అయినట్లు అబూబక్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ముస్లిం మత పెద్దలు రజనీకాంత్‌ను ఆయన ఇంటి వద్ద కలిశారు. మత పెద్దలు రజనీని కలవడం చర్చకు దారి తీస్తోంది. -
‘విజయ్‌కు పూలమాల వేస్తా’
తమిళనాడు, పెరంబూరు: ప్రజల్లో అధిక ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్కేనని, లంచగొండులను పట్టిస్తే హీరో విజయ్‌కు పూలమాల వేసి స్వాగతిస్తానని కేంద్రమంత్రి, బీజేపీ నేత పొన్రాధాకృష్టన్ అన్నారు. తన తాజా చిత్రం సర్కార్ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే వర్గాల్లో ప్రకంపనలు పట్టిస్తున్నాయి. అంతే కాదు విజయ్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ గురువారం ఉదయం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన ఈ క్రింది విధంగా బదులిచ్చారు. ప్ర: హైడ్రోకార్బన్న పథకానికి వ్యతిరేకంగా డీఎంకే పార్టీ పోరాటం చేయడంపై మీ స్పందన? జ: అది పనిలేని కార్యం. వారు ఏం కావాలో అడిగారా? డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు హైడ్రోకార్బన్ పథకం గురించి మాట్లాడే అర్హత లేదు, ప్ర: బీజేపీకి వ్యతిరేకంగా రెండవ స్వాతంత్య్ర పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యల గురించి? జ: వారికి స్వాతంత్య్రం రాదు, ఎప్పుడూ ఊహల్లోనే పోరాటం చేస్తారు. ప్ర: ఇటీవల నటుడు విజయ్ సీఎంనైతే నిజాయితీగా ఉంటా. నటించను అని అనడం గురించి మీ కామెంట్? జ: అందరూ ఎంజీఆర్, జయలలితలా కాలేరు. ఇప్పుడు ప్రజల మధ్య ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్ మాత్రమే. ప్ర: బీజేపీ రజనీకాంత్‌ను వెనకేసుకు రావడానికి కారణం? జ: ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. పలువురు నటులు, పత్రికల వాళ్లు వివిధ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు. ఏదో తమిళనాడు దిక్కులేనిదిగా భావిస్తూ రాజకీయాల్లోకి రాకూడదన్నారు. నటుడు విజయ్ లంచం గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఆరోపణలు చేయాలని కాకుండా అలాంటి లంచగొండులను ఆయన పట్టిస్తే నేను ఆయన వద్దకు నేరుగా వెళ్లి పూలమాల వేసి స్వాగతిస్తాను. రజనీకాంత్‌కు మంచి మనిషి అని ప్రజల్లో పేరు ఉంది. ప్ర: రజనీకాంత్ భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తారా? జ: రజనీకాంత్ ఇంకా పార్టీనే స్థాపించలేదు. అయినా ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారా? అన్నది తెలియదు. ప్ర: పార్లమెంట్ ఎన్నికలకు మరో 6 నెలల కాలమే ఉంది. మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జ: ఇప్పటి కంటే కూడా అధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. బీజేపీ 350 స్థానాలను, కూటమితో కలిసి 400లకు పైగా స్థానాలను గెలుచుకుని మళ్లీ గద్దెనెక్కుతుంది. -
చర్యలు చేపట్టండి!
సాక్షి, చెన్నై:తమిళ జాలర్ల విడుదల, పడవల స్వాధీనం, కచ్చదీవుల సమస్యపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర జాలర్ల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో ఆరు జిల్లాలకు చెందిన జాలర్ల సం ఘాల నేతల ఆదివారం చెన్నైలో సమావేశమయ్యారు. మరోమారు చర్చల అనంతరం ఢిల్లీలోని పార్లమెంట్ ముట్టడి లక్ష్యంగా నిర్ణయం తీసుకోనున్నామని జాలర్ల సంఘాల నేతలు హెచ్చరించారు. రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ మీద దాడులతో విసిగి వేసారిన జాలర్లు గత వారం చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యూరు. శరణం నినాదంతో కచ్చదీవుల్లోకి వెళ్లడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతను రేకెత్తించింది. చివరకు కేంద్ర సహాయ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ జోక్యంతో జాలర్లు వెనక్కు తగ్గారు. జాలర్లకు పొన్ రాధాకృష్ణన్ హామీలు ఇచ్చారు. ఈ హామీల అమలు లక్ష్యంగా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు జాలర్లు సిద్ధమయ్యారు. సమాలోచన: కమలాలయంలో ఆదివారం జరిగిన రక్షాబంధన్ వేడుకలో రాధాకృష్ణన్పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాగపట్నం, రామనాథపురం, పుదుకోట్టై, కారైక్కాల్, తిరువారూర్, తదితర జిల్లాల జాలర్ల సంఘాల ప్రతినిధులు చెన్నైకు చేరుకుని పొన్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్ల విడుదల, పడవల స్వాధీనం గురించి చర్చించారు. కచ్చదీవుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని, పారంపర్య చేపల వేటకు అవకాశం కల్పించాలని విన్నవించారు. త్వరితగతిన కేంద్రంతో చర్చించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంకతో తమిళ జాలర్ల చర్చలకు మళ్లీ ప్రయత్నాలు చేపట్టాలన్నారు. ఇది వరకు జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయూలని విజ్ఞప్తి చేశారు. తదుపరి ఈ నెల 16న చెన్నైలో ఈ ప్రతినిధులు మళ్లీ మంత్రితో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానంతరం జాలర్ల సంఘాల నేత ఇళంగోవన్ మాట్లాడుతూ, ప్రతినిధులు అందరం వచ్చి ఇక్కడ చర్చించామని, తదుపరి మంత్రితో జరిగే చర్చల అనంతరం తమ నిర్ణయం ఉంటుందన్నారు. తదుపరి మంత్రి చర్చలతో ఫలితాలు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాలర్లందరూ ఏకమై పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తామని, ఇదే విషయూన్ని మంత్రి ముందు ఉంచినట్టు సమాచారం.