చర్యలు చేపట్టండి!
సాక్షి, చెన్నై:తమిళ జాలర్ల విడుదల, పడవల స్వాధీనం, కచ్చదీవుల సమస్యపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర జాలర్ల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో ఆరు జిల్లాలకు చెందిన జాలర్ల సం ఘాల నేతల ఆదివారం చెన్నైలో సమావేశమయ్యారు. మరోమారు చర్చల అనంతరం ఢిల్లీలోని పార్లమెంట్ ముట్టడి లక్ష్యంగా నిర్ణయం తీసుకోనున్నామని జాలర్ల సంఘాల నేతలు హెచ్చరించారు. రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ మీద దాడులతో విసిగి వేసారిన జాలర్లు గత వారం చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యూరు. శరణం నినాదంతో కచ్చదీవుల్లోకి వెళ్లడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతను రేకెత్తించింది.
చివరకు కేంద్ర సహాయ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ జోక్యంతో జాలర్లు వెనక్కు తగ్గారు. జాలర్లకు పొన్ రాధాకృష్ణన్ హామీలు ఇచ్చారు. ఈ హామీల అమలు లక్ష్యంగా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు జాలర్లు సిద్ధమయ్యారు. సమాలోచన: కమలాలయంలో ఆదివారం జరిగిన రక్షాబంధన్ వేడుకలో రాధాకృష్ణన్‌పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాగపట్నం, రామనాథపురం, పుదుకోట్టై, కారైక్కాల్, తిరువారూర్, తదితర జిల్లాల జాలర్ల సంఘాల ప్రతినిధులు చెన్నైకు చేరుకుని పొన్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్ల విడుదల, పడవల స్వాధీనం గురించి చర్చించారు. కచ్చదీవుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని, పారంపర్య చేపల వేటకు అవకాశం కల్పించాలని విన్నవించారు.
త్వరితగతిన కేంద్రంతో చర్చించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంకతో తమిళ జాలర్ల చర్చలకు మళ్లీ ప్రయత్నాలు చేపట్టాలన్నారు. ఇది వరకు జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయూలని విజ్ఞప్తి చేశారు. తదుపరి ఈ నెల 16న చెన్నైలో ఈ ప్రతినిధులు మళ్లీ మంత్రితో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానంతరం జాలర్ల సంఘాల నేత ఇళంగోవన్ మాట్లాడుతూ, ప్రతినిధులు అందరం వచ్చి ఇక్కడ చర్చించామని, తదుపరి మంత్రితో జరిగే చర్చల అనంతరం తమ నిర్ణయం ఉంటుందన్నారు. తదుపరి మంత్రి చర్చలతో ఫలితాలు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాలర్లందరూ ఏకమై పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తామని, ఇదే విషయూన్ని మంత్రి ముందు ఉంచినట్టు సమాచారం.