Fishing communities
-
మత్స్యకారుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి: ఎమ్మెల్యే దొరబాబు
-
‘లాక్డౌన్’ వారికి వరమే అయింది!
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా ముంబై మత్స్య కార్మికులు భారీగా నష్టపోయారని మొదట్లో వార్తలు విన్నాం. అది అర్ధ సత్యం మాత్రమే. ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన మత్స్య పరిశ్రమ, దాని మీద ఆధారపడి బతుకుతున్న దళారులు, పరిశ్రమ యజమానులు నష్ట పోయిన మాట వాస్తవమే. కానీ మత్స్యకారులు మాత్రం నష్ట పోలేదు. పైగా లాభపడ్డారు. మార్చి 24వ తేదీ అర్ధరాత్రి నుంచే లాక్డౌన్ అమల్లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మరుసటి రోజు, అంటే మార్చి 25వ తేదీన వేల సంఖ్యలో ముంబై మత్స్యకారులు సముద్ర తీరాన గుమిగూడి హాహాకారాలు చేశారు. వారంతా కోలి కులానికి చెందిన వారు. మాంసం, చేపలు అత్యవసర సరకుల జాబితాలోకి రావు కనుక ముంబైలోని చేపల పరిశ్రమలను మూసివేశారు. మరుసటి రోజు నుంచి తమ జీవనోపాధి ఎలా ? అంటూ మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. (లాక్డౌన్ : కేంద్రంపై రాహుల్ ఫైర్ ) మత్స్యపరిశ్రమలను మూసివేయడంతో 15 వేల టన్నుల చేపలను సముద్రం పాలు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కొన్ని రోజుల్లోనే వార్తలు వెలువడ్డాయి. ముంబై నగరం సమీపంలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ‘కరంజ్ ఫిషింగ్ కోపరేటివ్ సొసైటీ’కి డైరెక్టర్‌గా పని చేస్తోన్న గణేశ్ నఖావా, చేపలను నిత్యావసర సరకు కింద ప్రభుత్వం ప్రకటించాలంటూ ప్రయత్నించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆయన కొంత విజయం సాధించారు. లాక్డౌన్ నుంచి మత్స్యకారులకు మినహాయింపు పొందారు. మరి వారి చేపలను ఎక్కడా అమ్మాలి ? ఇక్కడే గణేశ్ కొంత దారులు వెతికారు. నేరుగా కస్టమర్లకే చేపలను అమ్మాలని నిర్ణయించారు. తన సొసైటీ పరిధిలోని మత్స్యకారులను సమీకరించి చేపల వేటను కొనసాగించారు. ఆయన తొలుత తన కారులో సరకును తీసుకొని వెళ్లి రోజుకు 50 కిలోల చొప్పున విక్రయించగా, కొన్ని రోజుల్లోనే రోజుకు మూడువేల కిలోల చేపలను విక్రయించడం ప్రారంభించారు. ముంబైలోని దాదార్, మహిమ్, బంద్ర, ఖర్, శాంతాక్రజ్, అంధేరి ప్రాంతాల్లో విక్రయించినట్లు ఆయన చెప్పారు. ముంబై సముద్ర తీరాన ఆరువేల మంది కోలీ కులస్థులు చేపల వేటపై బతుకుతుండగా, వారిలో 50 బోట్లు కలిగిన 600 మంది కార్మికులు గణేశ్ నెట్వర్క్ పరిధిలోకి వచ్చి పనిచేశారు. గతంలోకన్నా ఇప్పుడు తాము పడుతున్న చేపలకు ఎక్కువ ధర పలుకుతోందని, పైగా గతంలో డబ్బుల కోసం పది, పదిహేను రోజులు నిరీక్షించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఏ రోజుకు ఆరోజే డబ్బులు అందుతున్నాయని మత్య్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం పంపిణీదారులపై ఆధారపడకుండా తామే నేరుగా కస్టమర్ల వద్దకు వెళుతుండడమని గణేశ్ వివరించారు. ఆ తర్వాత మిగత సొసైటీలు కూడా గణేశ్ మార్గాన్నే ఆశ్రయించి లాభపడుతున్నాయి. (భారత్‌పై కరోనా పడగ) -
రగిలిన ఆక్రోశం
శ్రీలంక సేనల తుపాకీ తూటా తమ వాడ్ని బలిగొనడంతో రాష్ట్రంలోని జాలర్లలో ఆక్రోశం రగిలింది. రామేశ్వరం, తంగచ్చిమండంలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీరికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పోరు బాటకు జాలర్ల సంఘాలు సిద్ధం అయ్యాయి. బుధవారం జాలర్ల గ్రామాల్లో ఇళ్లపై నల్ల జెండాలు ఎగిరాయి. గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించేందుకు జాలర్ల సంఘాలు నాగపట్నం వేదికగా సమావేశం కానున్నాయి. సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక సేనల వీరంగాలు నిత్యం కొనసాగుతూనే వస్తున్నాయి. కచ్చదీవుల్లో వేటలో ఉన్న జాలర్లపై మంగళవారం తుపాకీ ఎక్కబెట్టడంతో, వారి తూటాకు తంగచ్చిమడంకు చెందిన ప్రిట్సో బలి అయ్యాడు.ఈ ఘటనతో జాలర్లలో తీవ్ర ఆందోళన బయల్దేరింది. తమ వాడి మీద శ్రీలంక సేనలు మళ్లీ తుపాకీ ఎక్కుబెట్టడంతో ఆక్రోశంతో జాలర్ల సంఘాలు రగిలి పోతున్నాయి. రామేశ్వరం, తంగచ్చిమడంలలో బుధవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. జాతీయ రహదారి వెంబడి బైఠాయించిన ఆందోళనకారుల్ని బుజ్జగించడం పోలీసులకు సంకటంగా మారింది. ఎక్కడ మధురై వైపుగా జాతీయ రహదారిలో బైఠాయించి, వాహనాల రాక పోకల్ని స్తంభింప చేస్తారోనన్న ఉత్కంఠ మొదలైంది. తమ మీద దాడులకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా కచ్చదీవుల స్వాధీనం, శ్రీలంక దౌత్యాధికారుల్ని వెనక్కు పంపించాలన్న డిమాండ్లతో నినాదాల్ని జాలర్లు హోరెత్తిస్తున్నారు. ఇక, తుపాకీ తూటా నుంచి తప్పించుకున్న సరోన్ ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీలంక సేనలపై మూడు రకాల సెక్షన్ల కింద తంగచ్చిమండం పోలీసులు కేసు నమోదు చేశారు. పోరు బాట: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనల్ని ఉధృతం చేయడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇళ్లపై నల్ల జెండాలను ఎగుర వేసి తమ నిరసనను తెలియజేశారు. గురువారం నాగపట్నం వేదికగా రామనాథపురం, పుదుకోట్టై, తంజావూరు తదితర సముద్ర తీర జిల్లాల్లోని జాలర్ల సంఘాలు సమావేశం కానున్నాయి. ఇందులో సమ్మె చేపట్టడం లేదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ఓ నేత పేర్కొన్నారు. జాలర్ల సంఘాలు కీలక నిర్ణయం తీసుకోనుండడంతో సీఎం ఎడపాడి పళనిస్వామి మేల్కొన్నారు. శ్రీలంక చెరలో ఉన్న జాలర్ల విడుదల, దాడులకు అడ్డుకట్ట నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రం సంధించారు. భారత సముద్ర తీర సరిహద్దులో కోస్టు గార్డ్, నావికాదళం వర్గాలు గస్తీని ముమ్మరం చేశాయి. భారత సరిహద్దులోకి వేదారణ్యం సమీపంలో చొరబడ్డ పది మంది శ్రీలంక జాలర్లను అదుపులోకి తీసుకున్నాయి. కోర్టుకు వ్యవహారం: 1983 నుంచి జాలర్ల మీద జరుగుతున్న దాడుల్ని వివరిస్తూ, ఇప్పటి వరకు తూటాలకు బలైన జాలర్ల వివరాలు, ఎదురైన నష్ట, కష్టాలను వివరిస్తూ జాలర్ల సంఘం నాయకుడు పీటర్ రాయల్ పిటిషన్ దాఖలు చేశారు. జాలర్ల సంక్షేమం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తులు రమేష్, సుందర్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ విజ్ఞప్తి న్యాయ బద్దంగా ఉందని, సంక్షేమం లక్ష్యంగా చర్యలకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని ఆదేశించారు. మార్చురీకే పరిమితం: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ప్రిట్సో మృత దేహాన్ని తీసుకోబోమని జాలర్లు, కుటుంబీకులు స్పష్టం చేశారు. దీంతో మృతదేహాన్ని మార్చురీకే పరిమితం చేశారు. అతడి కుటుంబాన్ని ఓదార్చేందుకు మత్స్య శాఖ మంత్రి జయకుమార్ తీవ్రంగానే ప్రయత్నించారు. మృతదేహాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా ఆ కుటుంబం ఖాతరు చేయలేదు. -
చర్యలు చేపట్టండి!
సాక్షి, చెన్నై:తమిళ జాలర్ల విడుదల, పడవల స్వాధీనం, కచ్చదీవుల సమస్యపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర జాలర్ల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో ఆరు జిల్లాలకు చెందిన జాలర్ల సం ఘాల నేతల ఆదివారం చెన్నైలో సమావేశమయ్యారు. మరోమారు చర్చల అనంతరం ఢిల్లీలోని పార్లమెంట్ ముట్టడి లక్ష్యంగా నిర్ణయం తీసుకోనున్నామని జాలర్ల సంఘాల నేతలు హెచ్చరించారు. రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ మీద దాడులతో విసిగి వేసారిన జాలర్లు గత వారం చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యూరు. శరణం నినాదంతో కచ్చదీవుల్లోకి వెళ్లడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతను రేకెత్తించింది. చివరకు కేంద్ర సహాయ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ జోక్యంతో జాలర్లు వెనక్కు తగ్గారు. జాలర్లకు పొన్ రాధాకృష్ణన్ హామీలు ఇచ్చారు. ఈ హామీల అమలు లక్ష్యంగా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు జాలర్లు సిద్ధమయ్యారు. సమాలోచన: కమలాలయంలో ఆదివారం జరిగిన రక్షాబంధన్ వేడుకలో రాధాకృష్ణన్పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాగపట్నం, రామనాథపురం, పుదుకోట్టై, కారైక్కాల్, తిరువారూర్, తదితర జిల్లాల జాలర్ల సంఘాల ప్రతినిధులు చెన్నైకు చేరుకుని పొన్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్ల విడుదల, పడవల స్వాధీనం గురించి చర్చించారు. కచ్చదీవుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని, పారంపర్య చేపల వేటకు అవకాశం కల్పించాలని విన్నవించారు. త్వరితగతిన కేంద్రంతో చర్చించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంకతో తమిళ జాలర్ల చర్చలకు మళ్లీ ప్రయత్నాలు చేపట్టాలన్నారు. ఇది వరకు జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయూలని విజ్ఞప్తి చేశారు. తదుపరి ఈ నెల 16న చెన్నైలో ఈ ప్రతినిధులు మళ్లీ మంత్రితో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానంతరం జాలర్ల సంఘాల నేత ఇళంగోవన్ మాట్లాడుతూ, ప్రతినిధులు అందరం వచ్చి ఇక్కడ చర్చించామని, తదుపరి మంత్రితో జరిగే చర్చల అనంతరం తమ నిర్ణయం ఉంటుందన్నారు. తదుపరి మంత్రి చర్చలతో ఫలితాలు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాలర్లందరూ ఏకమై పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తామని, ఇదే విషయూన్ని మంత్రి ముందు ఉంచినట్టు సమాచారం.