శ్రీలంక సేనల తుపాకీ తూటా తమ వాడ్ని బలిగొనడంతో రాష్ట్రంలోని జాలర్లలో ఆక్రోశం రగిలింది. రామేశ్వరం, తంగచ్చిమండంలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీరికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పోరు బాటకు జాలర్ల సంఘాలు సిద్ధం అయ్యాయి. బుధవారం జాలర్ల గ్రామాల్లో ఇళ్లపై నల్ల జెండాలు ఎగిరాయి. గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించేందుకు జాలర్ల సంఘాలు నాగపట్నం వేదికగా సమావేశం కానున్నాయి.
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక సేనల వీరంగాలు నిత్యం కొనసాగుతూనే వస్తున్నాయి. కచ్చదీవుల్లో వేటలో ఉన్న జాలర్లపై మంగళవారం తుపాకీ ఎక్కబెట్టడంతో, వారి తూటాకు తంగచ్చిమడంకు చెందిన ప్రిట్సో బలి అయ్యాడు.ఈ ఘటనతో జాలర్లలో తీవ్ర ఆందోళన బయల్దేరింది. తమ వాడి మీద శ్రీలంక సేనలు మళ్లీ తుపాకీ ఎక్కుబెట్టడంతో ఆక్రోశంతో జాలర్ల సంఘాలు రగిలి పోతున్నాయి. రామేశ్వరం, తంగచ్చిమడంలలో బుధవారం కూడా ఆందోళనలు కొనసాగాయి.
జాతీయ రహదారి వెంబడి బైఠాయించిన ఆందోళనకారుల్ని బుజ్జగించడం పోలీసులకు సంకటంగా మారింది. ఎక్కడ మధురై వైపుగా జాతీయ రహదారిలో బైఠాయించి, వాహనాల రాక పోకల్ని స్తంభింప చేస్తారోనన్న ఉత్కంఠ మొదలైంది. తమ మీద దాడులకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా కచ్చదీవుల స్వాధీనం, శ్రీలంక దౌత్యాధికారుల్ని వెనక్కు పంపించాలన్న డిమాండ్లతో నినాదాల్ని జాలర్లు హోరెత్తిస్తున్నారు. ఇక, తుపాకీ తూటా నుంచి తప్పించుకున్న సరోన్ ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీలంక సేనలపై మూడు రకాల సెక్షన్ల కింద తంగచ్చిమండం పోలీసులు కేసు నమోదు చేశారు.
పోరు బాట: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనల్ని ఉధృతం చేయడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇళ్లపై నల్ల జెండాలను ఎగుర వేసి తమ నిరసనను తెలియజేశారు. గురువారం నాగపట్నం వేదికగా రామనాథపురం, పుదుకోట్టై, తంజావూరు తదితర సముద్ర తీర జిల్లాల్లోని జాలర్ల సంఘాలు సమావేశం కానున్నాయి. ఇందులో సమ్మె చేపట్టడం లేదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ఓ నేత పేర్కొన్నారు. జాలర్ల సంఘాలు కీలక నిర్ణయం తీసుకోనుండడంతో సీఎం ఎడపాడి పళనిస్వామి మేల్కొన్నారు. శ్రీలంక చెరలో ఉన్న జాలర్ల విడుదల, దాడులకు అడ్డుకట్ట నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రం సంధించారు. భారత సముద్ర తీర సరిహద్దులో కోస్టు గార్డ్, నావికాదళం వర్గాలు గస్తీని ముమ్మరం చేశాయి. భారత సరిహద్దులోకి వేదారణ్యం సమీపంలో చొరబడ్డ పది మంది శ్రీలంక జాలర్లను అదుపులోకి తీసుకున్నాయి.
కోర్టుకు వ్యవహారం: 1983 నుంచి జాలర్ల మీద జరుగుతున్న దాడుల్ని వివరిస్తూ, ఇప్పటి వరకు తూటాలకు బలైన జాలర్ల వివరాలు, ఎదురైన నష్ట, కష్టాలను వివరిస్తూ జాలర్ల సంఘం నాయకుడు పీటర్ రాయల్ పిటిషన్ దాఖలు చేశారు. జాలర్ల సంక్షేమం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తులు రమేష్, సుందర్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ విజ్ఞప్తి న్యాయ బద్దంగా ఉందని, సంక్షేమం లక్ష్యంగా చర్యలకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని ఆదేశించారు.
మార్చురీకే పరిమితం: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ప్రిట్సో మృత దేహాన్ని తీసుకోబోమని జాలర్లు, కుటుంబీకులు స్పష్టం చేశారు. దీంతో మృతదేహాన్ని మార్చురీకే పరిమితం చేశారు. అతడి కుటుంబాన్ని ఓదార్చేందుకు మత్స్య శాఖ మంత్రి జయకుమార్ తీవ్రంగానే ప్రయత్నించారు. మృతదేహాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా ఆ కుటుంబం ఖాతరు చేయలేదు.
రగిలిన ఆక్రోశం
Published Thu, Mar 9 2017 2:48 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
Advertisement