సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్ కారణంగా ముంబై మత్స్య కార్మికులు భారీగా నష్టపోయారని మొదట్లో వార్తలు విన్నాం. అది అర్ధ సత్యం మాత్రమే. ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన మత్స్య పరిశ్రమ, దాని మీద ఆధారపడి బతుకుతున్న దళారులు, పరిశ్రమ యజమానులు నష్ట పోయిన మాట వాస్తవమే. కానీ మత్స్యకారులు మాత్రం నష్ట పోలేదు. పైగా లాభపడ్డారు. మార్చి 24వ తేదీ అర్ధరాత్రి నుంచే లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మరుసటి రోజు, అంటే మార్చి 25వ తేదీన వేల సంఖ్యలో ముంబై మత్స్యకారులు సముద్ర తీరాన గుమిగూడి హాహాకారాలు చేశారు. వారంతా కోలి కులానికి చెందిన వారు. మాంసం, చేపలు అత్యవసర సరకుల జాబితాలోకి రావు కనుక ముంబైలోని చేపల పరిశ్రమలను మూసివేశారు. మరుసటి రోజు నుంచి తమ జీవనోపాధి ఎలా ? అంటూ మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. (లాక్‌డౌన్ : కేంద్రంపై రాహుల్ ఫైర్ )
మత్స్యపరిశ్రమలను మూసివేయడంతో 15 వేల టన్నుల చేపలను సముద్రం పాలు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కొన్ని రోజుల్లోనే వార్తలు వెలువడ్డాయి. ముంబై నగరం సమీపంలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ‘కరంజ్ ఫిషింగ్ కోపరేటివ్ సొసైటీ’కి డైరెక్టర్‌గా పని చేస్తోన్న గణేశ్ నఖావా, చేపలను నిత్యావసర సరకు కింద ప్రభుత్వం ప్రకటించాలంటూ ప్రయత్నించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆయన కొంత విజయం సాధించారు. లాక్‌డౌన్ నుంచి మత్స్యకారులకు మినహాయింపు పొందారు. మరి వారి చేపలను ఎక్కడా అమ్మాలి ? ఇక్కడే గణేశ్ కొంత దారులు వెతికారు.
నేరుగా కస్టమర్లకే చేపలను అమ్మాలని నిర్ణయించారు. తన సొసైటీ పరిధిలోని మత్స్యకారులను సమీకరించి చేపల వేటను కొనసాగించారు. ఆయన తొలుత తన కారులో సరకును తీసుకొని వెళ్లి రోజుకు 50 కిలోల చొప్పున విక్రయించగా, కొన్ని రోజుల్లోనే రోజుకు మూడువేల కిలోల చేపలను విక్రయించడం ప్రారంభించారు. ముంబైలోని దాదార్, మహిమ్, బంద్ర, ఖర్, శాంతాక్రజ్, అంధేరి ప్రాంతాల్లో విక్రయించినట్లు ఆయన చెప్పారు. ముంబై సముద్ర తీరాన ఆరువేల మంది కోలీ కులస్థులు చేపల వేటపై బతుకుతుండగా, వారిలో 50 బోట్లు కలిగిన 600 మంది కార్మికులు గణేశ్ నెట్‌వర్క్ పరిధిలోకి వచ్చి పనిచేశారు. గతంలోకన్నా ఇప్పుడు తాము పడుతున్న చేపలకు ఎక్కువ ధర పలుకుతోందని, పైగా గతంలో డబ్బుల కోసం పది, పదిహేను రోజులు నిరీక్షించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఏ రోజుకు ఆరోజే డబ్బులు అందుతున్నాయని మత్య్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం పంపిణీదారులపై ఆధారపడకుండా తామే నేరుగా కస్టమర్ల వద్దకు వెళుతుండడమని గణేశ్ వివరించారు. ఆ తర్వాత మిగత సొసైటీలు కూడా గణేశ్ మార్గాన్నే ఆశ్రయించి లాభపడుతున్నాయి. (భారత్‌పై కరోనా పడగ)
Comments
Please login to add a commentAdd a comment