Ponnam prabhaker
-
పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతల ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 14లోగా పంజాగుట్టలో విగ్రహాన్ని ప్రతిష్టించనట్లయితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు, మాజీ ఎంపీలు ధర్నాకు దిగారు. సీనియర్ నేత వీహెచ్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మల్లు రవి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు అడ్డుపడి ఆయన విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం అవమానకరం. అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీఎం చర్యలు తీసుకోవాలి. పంజాగుట్టలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలి. లేదంటే మా పోరాటం మరింత ఉధృతమవుతుంది’’ అని పేర్కొన్నారు. -
మీ హామీలు నీటిమూటలేనా
► మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదని.. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యేలా పరిపాలన సాగిస్తూ ప్రజలను మభ్యపెడుతున్న ఆయనకు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన సందర్భం నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కరీంనగర్ ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తొలిసారిగా కరీంనగర్లో సీఎంగా పర్యటించిన సమయంలో 2014 ఆగస్టు 5న జిల్లా కేంద్రంలో 4 గంటలు సమీక్ష జరిపి 40 వరాలు ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీకి అతీగతీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌ను లండన్, న్యూయార్క్, మోడల్ నగరంగా తీర్చిదిద్దుతానని, అద్దం తునకలాగా మెరిపిస్తానని, రింగ్‌రోడ్డులు, ఫోర్‌లేన్ రహదారులు నిర్మిస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. లోయర్ మానేరు డ్యాం ప్రాంతాన్ని మైసూరులోని బృందావన్ గార్డెన్‌లా తీర్చిదిద్దుతానని, డ్యాంలో బోటింగ్, రెస్టారెంట్లు ఏర్పాటు చేసి పర్యాటకులు విడిది చేసేందుకు వీలుగా విల్లాస్ నిర్మిస్తానని ఇచ్చిన వాగ్ధానాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.మెడికల్ కళాశాల మంజూరు ఏమైందని, నిమ్స్ తరహా ఆసుపత్రి హామీ ఆటకెక్కిందని, లెదర్‌పార్క్, సైనిక్‌స్కూల్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, టెక్స్టైల్స్ మెగా పార్కులు ఇతర జిల్లాలకు తరలిపోయాయని దుయ్యబట్టారు. తాజాగా మరోమారు హైదరాబాద్‌లో 9 గంటలు సమీక్ష జరిపి మానేరు రివర్ ఫ్రంట్‌ను నిర్మించి కరీంనగర్ పట్టణాన్ని దేశంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారుస్తానని మరోసారి డ్రామాలకు తెరలేపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మార్చుకోవాలని సూచించారు. పూటకో అబద్దం అడుతూ రోజుకో జీవో తెస్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. మూడేళ్లల్లో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను పరిశీలిస్తే మాటల పోశెట్టి కేసీఆర్‌గా అనాల్సి వస్తోందని వాఖ్యానించారు. -
రైతు సమస్యలపై దృష్టి పెట్టండి: పొన్నం
సిరిసిల్ల: పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. భూగర్భజలాలు పడిపోయి నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. రైతులకు సహాయం అందించేందుకు కేంద్రంతో పోరాడితే రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతునిస్తామన్నారు. తాము రాజకీయం చేయడం లేదని, రైతులకు తమవంతుగా భరోసా ఇవ్వడానికి పర్యటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు వెళ్లి ఎండిన పంట పొలాల వివరాలను సేకరించి, ప్రభుత్వానికి, అధికారులకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అందజేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదు, ప్లీనరీ, బహిరంగసభలు అంటూ తిరగడం కాదని, రైతులను ఆదుకోవడంపై దృష్టిపెట్టాలని పొన్నం హితవు పలికారు.