రైతు సమస్యలపై దృష్టి పెట్టండి: పొన్నం
రైతు సమస్యలపై దృష్టి పెట్టండి: పొన్నం
Published Thu, Apr 6 2017 5:48 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
సిరిసిల్ల: పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. భూగర్భజలాలు పడిపోయి నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు.
రైతులకు సహాయం అందించేందుకు కేంద్రంతో పోరాడితే రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతునిస్తామన్నారు. తాము రాజకీయం చేయడం లేదని, రైతులకు తమవంతుగా భరోసా ఇవ్వడానికి పర్యటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు వెళ్లి ఎండిన పంట పొలాల వివరాలను సేకరించి, ప్రభుత్వానికి, అధికారులకు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అందజేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదు, ప్లీనరీ, బహిరంగసభలు అంటూ తిరగడం కాదని, రైతులను ఆదుకోవడంపై దృష్టిపెట్టాలని పొన్నం హితవు పలికారు.
Advertisement
Advertisement