చెంపలు వాసేలా కొట్టేసింది
ఒంగోలు (వలేటివారిపాలెం) : చిన్నారులకు ప్రేమగా పాఠాలు బోధించాల్సిన పంతులమ్మ సహనం కోల్పోయింది. ఎక్కాలు సకాలంలో రాయలేదన్న కోపంతో రెండో తరగతి విద్యార్థి చెంపలు వాసేలా కొట్టింది. ఈ సంఘటన వలేటివారిపాలెం మండలంలోని నూకవరం ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన పొనుగోటి రాజు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజూలానే సోమవారం పాఠశాలకు వెళ్లాడు. కాగా, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు రెండో తరగతి విద్యార్థులు ఎక్కాలు రాయడానికి పది నిమిషాల సమయం ఇచ్చారు. రాజు సకాలంలో రాయలేకపోవడంతో ఉపాధ్యాయురాలు విచక్షణ కోల్పోయి తీవ్రస్థాయిలో ఆగ్రహంతో గట్టిగా చెంపదెబ్బలు కొట్టారు. దీంతో రాజు బుగ్గలు బూరెల్లా వాచిపోయూయి.
టీచర్ చితకబాదడంతో భయాందోళన చెందిన రాజు.. ఆ తరగతి అనంతరం చెప్పాపెట్టకుండా పారిపోయాడు. ఇంటికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు వెతుక్కుంటూ పాఠశాలకు వచ్చారు. అక్కడ లేకపోవడంతో ఊరంతా గాలించారు. చివరకు పొలాల్లో కనిపించిన రాజు..అసలు విషయం చెప్పడంతో టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సదరు ఉపాధ్యాయురాలు గతంలో కూడా ఇదేవిధంగా వేరే విద్యార్థిని చితకబాదిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రాజు తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.