తెలుగులోనే తీసికట్టు
పునాది బేస్లైన్ పరీక్షలో 40 శాతం విద్యార్థులకు చదవడం రాదుæ
ఇంగ్లిషు పరిస్థితి మరీ అధ్వానం
గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల తీరిదీ
వారు పైతరగతులకు వెళ్లిపోతున్నారు. కానీ అక్షర జ్ఞానం మాత్రం ఉండడం లేదు. నానాటికీ తీసికట్టవుతున్న విద్యాప్రమాణాలకు గిరిజన ఆశ్రమ పాఠశాలలు అద్దంపడుతున్నాయి. మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న 17,392 మంది విద్యార్థుల్లో సుమారు 7వేల మందికి కనీస అక్షర జ్ఞానం కూడా లేదు.
రంపచోడవరం:
ఏజెన్సీలో విద్యారంగాభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఎంతసేపూ పాఠశాలలో సౌకర్యాలు, మధ్యాహ్నభోజన పథక నిర్వహణపై దృష్టి సారిస్తున్న అధికారులు విద్యాప్రమాణాలను గాలికొదిలేశారు. దాంతో కనీస అక్షర జ్ఞానం కూడా లేకుండానే విద్యార్థులు పైతరగతులకు వెళ్లిపోతున్నారు. చివరకి కొందరు అధికారులు తొమ్మిదో తరగతి విద్యార్థులకు సైతం తెలుగు భాష చదవడం రాయడం రాదని తెలుసుకున్నారు. దాంతో రంపచోడవరం ఐటీడీఏ యాజమాన్యంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించేందుకు ఇటీవల పునాది బేస్లైన్ పరీక్ష నిర్వహించారు. ఏజెన్సీ 11 మండలాల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో17,392 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 40 శాతం మంది అంటే దాదాపు ఏడు వేల మందికి తెలుగులో కనీస అక్షరజ్ఞానం లేదని తేలింది.
బేస్లైన్ పరీక్ష నిర్వహించిందిలా..
ఏజెన్సీలోని 86 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిషు. గణిత సబ్జెక్టులపై సామర్థ్యాన్ని పరీక్షించారు. తెలుగులో అక్షరాలను చదవడం, రాయడం, వాక్యాలను చదడవడం, రాయడంపై నిర్వహించిన పరీక్షలో సుమారు 40 శాతం మందికి సామర్థ్యం లేదు. ఇంగ్లిషులో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
అస్తవ్యస్త విధానాలు
ఏజెన్సీలోని ప్రాథమిక పాఠశాలల పనితీరును పర్యవేక్షించాల్సిన ఏజెన్సీ విద్యాశాఖాధికారి పోస్టు ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఇన్చార్జి ఆ బాధ్యతను చూస్తున్నారు. గతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి జనశాల కార్యక్రమాన్ని అమలు చేశారు. రాష్ట్రంలోని తొమ్మిది ఐటీడీఏల్లో రూ. 9 కోట్లు ఖర్చు చేసి అమలు చేసిన పునాది కార్యక్రమం ప్రయోజనం చేకూర్చలేదు. ఏజెన్సీలోని కొన్ని పాఠశాలలను ఇంగ్లిషు మీడియం ఆశ్రమ పాఠశాలలుగా మార్చారు. దాంతో విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలో చదవలేక చదువుకు దూరమయ్యారు.